*ఇవే అసలైన సౌందర్య సాధనాలు*
ప్రతీసారి మనం ముఖ సౌందర్యం పెంచుకోవడం ఎలాగో మాట్లాడుకుంటాం. ఫౌండేషన్, మస్కారా వంటివి మన అందాన్ని పెంచేందుకు ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకుంటాం. అయితే ఈ ఉమెన్స్ డేకి మీ అసలైన సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అవి శాశ్వత అందాన్ని అందిస్తాయి అంటున్నారు నిపుణులు. వారి ఆ సూచనలేంటో చూద్దామా!
ఆత్మవిశ్వాసమే ఫౌండేషన్
మేకప్ అందంగా కుదరాలంటే ఫౌండేషన్ తప్పనిసరి. అంటే అంతర్లీనంగా మన అందం పెంచడంలో తోడ్పడే ఫౌండేషన్ ముఖ్యమైనది. ఆత్మవిశ్వాసం కూడా ఫౌండేషన్ లాంటిదే. మనదైన ముద్ర వేయాలన్నా, పదిమందిలో ఒకరిగా నిలబడాలన్నా ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడటం ముఖ్యం. అలా ఆత్మవిశ్వాసం మనలో పొంగి పొర్లాలంటే దానికి కొంచెం కృషి చేయాలి. మొదట మన ప్రత్యేకతలు ఏంటో గుర్తించాలి. గుర్తించాక వాటిని ఓచోట రాయాలి. వేరేవారి నుంచి మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు ఏంటో తెలిశాక, అవి ఎంత ప్రత్యేకమైనవో కూడా రాసుకోవాలి. అంటే, మనలోని శక్తిని గుర్తించడమే ఇది. అంతర్లీనంగా వున్న ఆ శక్తి ఏంటో మన మనసుకి, మెదడుకి చేరేలా చేయడానికే ఈ ప్రయత్నం. ఒక్కసారి అవి లోపలకి చేరాయా... ఇక మనం నిటారుగా నిలబడి, తలెత్తి ప్రపంచం కళ్ళలోకి కళ్ళుపెట్టి మాట్లాడతాం. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటాం. సమస్యలు రాగానే భయపడకుండా, వాటిని దాటే మార్గాల కోసం వెతుకుతాం. అందుకే ఆత్మవిశ్వాసం తప్పనిసరి అనేది. మనమీద మనకి నమ్మకం. మనల్ని మనం గుర్తించడం చాలా ముఖ్యమైన సౌందర్య సాధనాలు.
మన శరీర భాషే కాంపాక్ట్ పౌడర్
ముఖానికి మరికొంత గ్లో అద్దే కాంపాక్ట్ పౌడర్ లాంటిదే శరీర భాష. మనకి బోల్డంత ఆత్మవిశ్వాసం వుంది సరే. కానీ అది మనలో స్పష్టంగా బయటకి వ్యక్తం కాలేకపోతే లాభం ఏంటి? అలా వ్యక్తం కావాలంటే మన నడక హుందాగా వుండాలి. మన భుజాలు నిటారుగా నిలబడాలి. తలెత్తి సూటిగా చూస్తూ మాట్లాడాలి. మొత్తం మన బాడీ లాంగ్వేజ్‌లోనే ఓ గ్రేస్ రావాలి. అప్పుడు మనం సగం ప్రపంచాన్ని గెలిచినట్టే. ఎందుకంటే మనల్ని చూస్తూనే మన శక్తి ఏంటో ఎదుటివారు గుర్తించగలుగుతారు. ఇక అప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా మనం చెప్పాలనుకున్నది సూటిగా చెప్పచ్చు. అలా జరగాలంటే కావల్సిందల్లా స్పష్టమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలించే బాడీ లాంగ్వేజ్. విజేతల మానసిక స్థైర్యం వారి శరీర కదలికల్లో స్పష్టంగా కనిపిస్తుంది... గమనించండి.
నమ్మిందే చెప్పడం.. చెప్పిందే చెయ్యడం ఐ లైనర్ లాంటిది
మనం గట్టిగా నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినప్పుడు దాని ఫలితం ఉన్నతంగా వుంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు మథించి ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ తీసుకున్న నిర్ణయమే ఓ శక్తిగా మారి మనల్ని నడిపిస్తుంది. ఉత్సాహపరుస్తుంది. ఆటంకాలని దాటిపోయేలా చేస్తుంది. చాలాసార్లు మనం నమ్మేది ఒకటి... ఒత్తిడులకు తలొగ్గి చేయాల్సింది మరొకటి వుంటుంది. మనసులేని పని ఫలితం కూడా చప్పగానే వుంటుంది. అందుకే మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే దానిని చెప్పగలగాలి. ఏం చెప్పామో దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే ప్రపంచం మనల్ని నమ్ముతుంది. ‘‘మాటలు కోటలు దాటుతాయి కానీ, పనులు ఒక్క అడుగు వేయవు’’ అన్న సామెత వినే వుంటారు. కేవలం మాటలు చెబుతూ ఎదుటివారిని ఎంతోకాలం మభ్యపెట్టలేరు. ఆ గుర్తింపు క్షణికమైనది. అందుకే ఎదుటివారు ఒప్పుకున్నా, లేకపోయినా చేయగలిగింది మాత్రమే చెప్పండి. ఈ ఒక్క బేసిక్ క్వాలిటీ చాలు... మిమ్మల్ని సమూహం నుంచి ప్రత్యేకంగా నిలబెట్టడానికి. వేరే మేకప్ ఏం లేకున్నా ఐ లైనర్ వేసుకుంటే ఎంత అందం వస్తుందో, ఈ ఒక్క క్వాలిటీతో అంత అందం వస్తుంది మన వ్యక్తిత్వానికి.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీ వ్యక్తిత్వానికి కాటుక లాంటిది
భావోద్వేగాలను ఎప్పుడు, ఎలా, ఎంతవరకు వ్యక్తం చేయచ్చో తెలిసి తీరాలి ఓ విజేతకి. కొంతమంది కోపాన్ని అణచుకోలేరు. మరికొందరు బాధని, ఇంకొందరు సంతోషాన్ని. దేన్నయినా వెనకా ముందు చూడకుండా బయటకి వ్యక్తం చేయడం సరికాదు. ఎంత ఆత్మవిశ్వాసం వున్నా, ఎంత గొప్ప వ్యక్తిత్వం వున్నా ఈ ఒక్కటి చేతకాకపోతే ఇబ్బంది పడాల్సిందే. కాటుక ఒక్కటి సరిగా కుదరకపోతే ముఖంలోని అందమే మారిపోతుంది. అలానే ఈ భావోద్వేగాలు కూడా. మరి వాటిపై పట్టు సాధించటం ఎలా? కొంచెం శ్రమించాలి. కానీ, సాధ్యమే. తొణకుండా, బెణకకుండా, ఎదుటి వ్యక్తులను చులకన చేయకుండా, చెరగని చిరునవ్వు మాటున అంతరంగంలో చెలరేగే భావోద్వేగ సునామీలను దాచగలిగితే చాలు. మిమ్మల్ని మీరు జయించినట్టే. అలా అని ఆ భావోద్వేగాలని అస్సలు బయటపెట్టకుండా ఉండమని కాదు. ఎప్పుడు, ఎలా వ్యక్తం చేయాలో తెలిసుండాలి. వాటిని వ్యక్తం చేయడంలో కూడా ఓ హుందాతనం వుండాలి. దాని నుంచి మీరు ఆశించే ఫలితం వచ్చి తీరాలి. కోపం ప్రేరణనివ్వాలి. ఆవేశం దూకుడునివ్వాలి. వ్యతిరేక భావోద్వేగాలని ప్రేరణాత్మకంగా మార్చుకోవటమే విజేతల ముఖ్య లక్షణం. అందుకే కాటుక అందం రెట్టింపు అయ్యేలా చూసుకోండి.
మాటలే పెదాల అందాలని పెంచే లిప్‌స్టిక్
మాటే ఆయుధం. దానిని ఎలా ఉపయోగించామన్నదే ముఖ్యం. మాట తీరుతోనే మన వ్యక్తిత్వం బయటపడేది. మాటతీరులోనే విజయం కానీ, అపజయం కానీ మనల్ని కావలించుకునేది. అందుకే అతి ముఖ్యమైన ఆకర్షణ పెంచే సౌందర్య సాధనం ఇది. ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం. మన ఆలోచనలని మాటలుగా మార్చి చెప్పగలగాలి. ఆ మాటలలో మన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటం కావాలి. మన మాట చల్లగా వుండాలి. ఆ మాటలు తమని తాకాలని ఎదుటివారు తపించేలా వుండాలి. మాటలలో కరుణ, ప్రేమ కలగలిస్తే ప్రపంచం ఆ మాటల కోసం తపించిపోతుంది. వాటి రుచి చూడాలని ఆరాటపడుతుంది. కొద్దిగా శ్రద్ధ పెడితే సులువుగా సాధించవచ్చు మాటల మీద పట్టుని.
ఇలా మన సౌందర్యానికి శాశ్వత మెరుగులు అద్దుకుంటే ప్రపంచమే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది. కాలం కలిసొస్తుంది - ఆనందం నిన్ను వదలను ప్లీజ్ అంటుంది. ‘‘అప్పుడు జీవితమంటే ఇది’’ అనిపిస్తుంది. ఆ రుచి ఎలా వుంటుందో చెప్పటం కంటే స్వయంగా తెలుసుకుంటేనే బావుంటుంది.
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతీరోజూ మనదే. గడిచే రోజుపై మనదైన ముద్ర వేద్దాం. సగర్వంగా అంతెత్తున తలెత్తి ప్రపంచాన్ని పలకరిద్దాం.
-రమ