ఎండల్లో హాయిహాయిగా
ఎండాకాలం వచ్చిందంటే చాలు అమ్మాయిలు చర్మసౌందర్యం పట్ల మరింత శ్రద్ధ చూపించటం మొదలుపెడతారు. మిగిలిన కాలాల్లో కాంతులీనుతూ ఉండే చర్మం ఎండాకాలం వచ్చేసరికి మొహం పోడిబారిపోయినట్టు, జీవం లేనట్టు తయారవుతుంది. అలాంటప్పుడు రోజులో ఒక్క 10 నిమిషాలు ఈ సమస్య కోసం టైం కేటాయిస్తే చాలు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండచ్చు.
* ఎండలలో బయట తిరిగి ఇంటికి రాగానే ముందుగా మొహాన్ని శుభ్రం చేసుకోవటం మంచిది. సబ్బులతో పనిలేకుండా ఇంట్లోనే క్లెన్శింగ్ మిక్స్ ను తయారుచేసుకోవచ్చు. కాస్త బాదంపప్పు ,ఓట్స్, పాలు, రోస్ వాటర్ కలిపి మొహానికి పట్టించి కాసేపు ఉంచుకుని కడిగేసుకుంటే చాలు.
* కీరదోస కూడా మొహం మీద మురికి పోవటానికి చాల బాగా పనిచేస్తుంది. కీరా పేస్టు లో కొద్దిగా పాలు కలిపి మొహానికి రాసుకుంటే మొహం మీదుండే మురికి మొత్తం పోతుంది.
* ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అందరూ వాడతారు, అయితే అలా వాడేటప్పుడు దానిలో SPF అంటే sun protection factor కనీసం 15 ఉండేలా చూసుకోవాలి. ఇది మన చర్మాన్ని 15 శాతం ఎక్కువ కాపాడుతుంది. ఏమి అప్లయ్ చేయని చర్మం ఎండ బారిన పడటానికి 20 నిముషాలు పడుతుంది అదే సన్ స్క్రీన్ వాడితే 300 నిమిషాలు ఎండ మన మీద దాని ప్రభావాన్ని చూపించలేదు.
* ఎక్కువగా ఎండల్లో తిరగాల్సిన పని ఉన్నవాళ్ళు మొహం మీద జిడ్డు మొతాన్ని తొలగించుకోవటానికి స్ట్రాబెర్రీ లేదా బొప్పాయి పండు గుజ్జును మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత కడిగేసుకుంటే కనిపిస్తుంది.
* ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మొహానికి ఫేషియల్ చేయించుకోవటం కూడా చాలా అవసరం. ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ చేసుకోవాలంటే అలొవెరా జెల్ లో ఆరెంజ్ జ్యూస్ కలిపి మొహానికి పట్టించి 20 నిమిషాల తరువాత కదిగేసుకోవచ్చు.
* అరటి పండు, తేనే కలిపి మెత్తగా పేస్టులా చేసి మొహానికి పట్టించి అరగంట తరువాత కడిగేసుకున్నా చాలు మొహంలో మంచి నిగారింపు వస్తుంది.
ఇవన్ని ఎలా ఉన్నా ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండాలంటే టీ, కాఫీలకి దూరంగా ఉంటూ కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, బార్లీ, చోడుపిండి అంటే రాగి జావ, తాజా ఆకుకూరలు-కూరగాయలు, చక్కని ఫ్రూట్ జ్యూస్ లు తగిన విధంగా తీసుకుంటే చాలు ఎండ మన దగ్గరకి రావటానికి కూడా భయపడుతుంది.
..కళ్యాణి