చలికాలంలో పాదాలు జాగ్రత్త సుమా
చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చలికాలంలో పాదాలు, చేతులు రంగుమారిపోయి పగుళ్లు వచ్చి చూడ్డానికి బాగా వుండవు. అలాగే నొప్పి కూడా వుంటుంది. అంతే కాదు ఈ సీజన్‌లో చర్మం ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు ఏర్పడి, చారలు కనబడుతుంటాయి. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* పాదాలను మాయిశ్చరైజ్ చేయడం చలికాలంలో తప్పనిసరి అనుసరించాల్సిన మార్గం. చలికాలంలో రోజులో మూడు నాలుగుసార్లు పాదాలను మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పాదాలు ఫ్రెష్‌గా, ఫిట్‌గా, హెల్తీగా ఉంటాయి.
* స్లిప్పర్స్ ధరించడం సౌకర్యంగానే ఉంటుంది. కానీ, ఈ చలికాలంలో వాటిని వేసుకోకపోవడం మంచిది! చలికాలంలో పాదాలకు రక్షణ కల్పించాలంటే మందంగా ఉన్న షూస్ వేసుకోవాలి.
* పాదాలు అందముగా కనిపించాలంటే పదిహేను రోజులకోసారి పెడిక్యూర్ చేసుకోవాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉండే వస్తువులతో పెడిక్యూర్ చేసుకోవచ్చు. ముందుగా గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు, డెట్టాల్, షాంపూ వేయాలి. తరువాత 20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి బ్రష్‌తో రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి పాదాలను బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల పాదాలు పొడిబారవు.
* వేసవికాలం, చలికాలం అని కాకుండా అన్ని సీజన్స్‌లో నీరు ఎక్కువగా తాగితే మంచిది. చర్మం, పాదాలు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటాయి.
* పాదాల చాలామంది సాక్సులు వాడుతుంటారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వేసుకోవాలి . లేదంటే దుమ్ము, మురికి చేరి చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలానే నైలాన్ సాక్సుల కంటే కాటన్‌వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కుని, మాయిశ్చరైజ్ ఇలా చేయటం వల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి.