భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఈ ఐదే ప్రధాన కారణాలట!

సంతోషకరమైన వైవాహిక జీవితం,  సంతోషకరమైన కుటుంబం చాలా మంది కల. వివాహాం తరువాత  ప్రతి జంట సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. ఏడు జన్మల సంబంధం అనుకునే వివాహ బంధాన్ని ఒక్క జన్మకు కూడా కొనసాగించలేని పరిస్థితులు ఎదురవుతాయి. భార్యాభర్తలు తమ బంధంలో తీసుకునే నిర్ణయాలు, వారి అభిప్రాయాలు కొన్నిసార్లు   వారి సంబంధానికి శత్రువులుగా మారతాయి. ఇదే వారి మధ్య పెద్ద అడ్డుగోడ కడుతుంది. ఇది ద్వేషంగా కూడా మారుతుంది. ఈ ద్వేషం మితిమీరిపోతే ఎంతో సంతోషంగా గడపాల్సినవారు కాస్తా  విడిపోవాలని నిర్ణయించుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసే ముఖ్యమైన విషయాలేంటో ముందే తెలుసుకుని వాటిని తమ జీవితంలో పొరపాటున కూడా ప్రస్తావించకపోవడం ఉత్తమం.

అన్నింటిలో తప్పులు, లోపాలు వెతకడం..

ఎప్పుడూ ఒకరి వ్యక్తిత్వంలో లేదా పనిలో  లోపాలను వెతుక్కునే భార్యాభర్తలు బంధాన్ని  నిలకడగా నిలుపుకోలేరు. ఒకరిలోపాలను ఒకరు పదే పదే ఎత్తిచూపుతుంటే ఆ సంబంధం చాలా ప్రతికూలంగా మారుతుంది.  కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోవడమే మంచిదనే ఆలోచన కూడా పుడుతుంది. నిజానికి ఇలా తప్పులు ఎంచడం భార్యాభర్తల బంధంలోనే కాదు.. వేరే ఏ బంధంలో కూడా మంచిది కాదు.

ఒక్కరిమీదే భారం ఉండటం..

వైవాహిక జీవితంలో భాగస్వాములిద్దరూ సమానంగా  ఉండాలి. భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటిపని చూసుకోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే ఇంటి పనులు ఇద్దరూ చూసుకోవడం చేయాలి. అలాగే ఎవరికి నచ్చిన పనిని వారు మాత్రమే చేసుకోకుండా ఇద్దరూ కలసి చేయాలి. నీ పని నీది, నాపని నాది అనే భావన పొరపాటున కూడా చూపించవద్దు. వ్యక్తిగతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటే భార్యాభర్తల మధ్య  తాము ఒక్కటనే ఫీలింగ్ కొరవడుతుంది.

ఫోన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం..

ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి కంటే తన ఫోన్‌పై ఎక్కువ శ్రద్ధ చూపితే అది వారి సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  ఈ అలవాటు వల్ల దాంపత్య సంతృప్తి తగ్గుతుందని, రోజుకోక గొడవ సర్వసాధారణమైపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రజలను డిప్రెషన్ వైపు నడిపిస్తాయి. బంధం చీలిపోవడానికి కారణం అవుతాయి.

మనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం..

డబ్బు నిర్వహణలో సరైన అవగాహన లేని భాగస్వాములతో కలసి జీవించడానికి చాలా మంది అనాసక్తి చూపిస్తారు. డబ్బు బ్రతకడానికి ప్రధాన వస్తువు అయినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం చాలా బాగా తెలిసి ఉండాలి. డబ్బును నిర్లక్ష్యం చేసేవారితో భాగస్వాములు ఎక్కువగా గొడవలు పడతారు.  ఇలాంటి గొడవలు  జరగడం ఆ తరువాత గొడవలు మాములు అయిపోవడం కూడా జరుగుతుంది.

అన్నీ లెక్కలు వేసుకోవడం..

 భాగస్వామి కోసం తాము చేసిన ఖర్చులను  ఎప్పుడూ  లెక్కగట్టే వారు కొందరు ఉంటారు. ఇలాంటివారు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనిపించేలా ఉంటుంది వారి ప్రవర్తన. భాగస్వామితో సంతోషాలను వారికోసం చేసే ఖర్చును మాటిమాటికి లెక్కవేయడం, దాన్ని పదే పదే భాగస్వామి దగ్గర ప్రస్తావించడం వల్ల  వైవాహిక జీవితంలో సంతోషం దెబ్బతింటుంది.

                                                        *నిశ్శబ్ద