ఫేషియల్ తరువాత ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

అమ్మాయిలు ఆరోగ్యం కంటే కూడా చర్మసంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అందం ఎప్పుడూ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేసవి కాలంలో  ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా  వస్తాయి. మరీ ముఖ్యంగా ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. సూర్యరశ్మి కారణంగా చర్మం కమిలిపోవడం, రంగు మారడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మహిళలు తమ ముఖానికి ఫేషియల్ చేయించుకుంటారు. ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగి, ముఖచర్మం  శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.

కానీ వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా, ఇంట్లో సొంతంగానే పేషియల్ చేసుకున్నా.. ఫేషియల్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న వయసులోనే ముసలితనం మొదలవుతుందని మీకు తెలుసా? చాలా మంది బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఫేషియల్ చేయించుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించకపోతే.. ఫేషియల్స్  అందాన్ని ఇవ్వడానికి బదులుగా హాని కలిగిస్తాయి. ఫేషియల్ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..

మేకప్‌కు దూరంగా ఉండాలి..

ఫేషియల్ చేసినప్పుడు ముఖ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటి సమయంలో  వెంటనే మేకప్ చేస్తే, అది చర్మ సమస్యలను కలిగిస్తుంది.మేకప్ తాలూకూ రసాయనాలు చర్మరంధ్రాల్లోకి చొచ్చుకెళ్లి చర్మానికి నష్టం చేకూరుస్తుంది.

సూర్యరశ్మికి గురికాకూడదు..

ఫేషియల్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. పార్లర్ నుంచి ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలో, దుమ్ములో బయటికి వెళితే దుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాహనాల పొగ, సూర్యకిరణాల ప్రభావం అన్నీ కలిపి చర్మాన్ని తొందరగా పాడుచేస్తాయి. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకున్న తరువాత స్కూటీ ప్రయాణం మానుకోవాలి, ఆటోలో వెళ్లడం మంచిది. స్యూటీలో వెళ్ళాలి అంటే ముఖానికి స్కార్ఫ్  వాడటం మరచిపోకూడదు. 

ఫేస్‌వాష్‌తో అస్సలు చేయొద్దు..

 ఫేషియల్ చేయించుకున్న తరువాత  రోజు మొత్తం  ఫేస్‌వాష్‌ని ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. పొరపాటున ఫేస్ వాష్ ఉపయోగిస్తే ఫేషియల్ ద్వారా చర్మానికి అందిన మృదుత్వం పోతుంది. ఫలితంగా ఫేస్ వాష్ లో రసాయనాల వల్ల చర్మరంధ్రాలు దెబ్బతిని ఓపెన్ పోర్స్ సమస్యకు దారితీస్తుంది.

చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి..

ఫేషియల్ తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులను  దూరంగా ఉంచాలి . ఫేషియల్  ముఖచర్మం లోపలివరకు ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో చర్మసంరక్షణ ఉత్పత్తులు వాడితే అందులో ఉన్న రసాయనాల వల్ల చర్మం మరింత సున్నితమైపోయి దారుణంగా దెబ్బతింటుంది. అందుకే ఫేషియల్  తర్వాత  స్క్రబ్ చేయడం, ఇతర ఉత్పత్తులు వాడటం చేయకూడదు.

                                   ◆నిశ్శబ్ద.