ప్రెగ్నెన్సీ సమయంలో దానిమ్మ తింటే ఎన్ని లాభాలో తెలుసా!

గర్భిణీలు గర్భధారణ సమయంలో పండ్లు తినడం ద్వారా పిండం ఆరోగ్యంగా ఉంటుంది. వివిధ రకాల పోషకాలతో కూడిన పండ్లను గర్భిణీలు రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు దానిమ్మపండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే దానిమ్మలో పొటాషియం, కాల్షియం, విటమిన్లు, సి, కె, బి, ఎ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. గర్భం దాల్చిన మొదటి త్రైమాసికం నుంచి క్రమంతప్పకుండా దానిమ్మను తీసుకున్నట్లయితే..తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. గర్బిణీలు దానిమ్మను తమ డైట్లో చేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.

రక్తప్రసరణను పెంచుతుంది:

దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు పిండం అభివృద్ధికి ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు. దానిమ్మ రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో విటమిన్ సి లోపం లేదా ఐరన్ సమస్యలు రక్తహీనతకు దారితీస్తాయి. కాబట్టి గర్భధారణ సమయంలో దానిమ్మ తీసుకోవడం చాలా ముఖ్యం.

రక్తపోటుకు చెక్:

సాధారణంగా గర్భిణీలు అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. ప్రసూతి రక్తపోటు శిశువు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. గర్భస్రావానికి దారితీస్తుంది. మెదడు దెబ్బతినడం, కడుపులోనే బిడ్డ చనిపోవడం వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది. దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

ఎముకలు గట్టిగా మారుతాయి:

దానిమ్మలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలు, గుడ్ల మాదిరిగానే దానిమ్మ ఎముకలకు కూడా మేలు చేస్తుంది. గర్భిణీలు ఎముకలను బలోపేతం చేయడంలో దానిమ్మ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే తల్లి, పిండం ఎముకలు దృఢంగా ఉంటాయి.

మెదడు అభివృద్ధి:

దానిమ్మ రసంలో పాలీఫెనాలిక్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఇది పిల్లల మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెదడు గాయాలు, ఒత్తిడి నుండి పిల్లలను రక్షిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. కాబట్టి పిల్లల అభివృద్ధిపై దానిమ్మ చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

అకాల ప్రసవం:

కొంతమంది గర్భిణీలు వారు అనుసరించే జీవనశైలి కారణంగా నెలలు నిండకుండానే ప్రసవిస్తారు. పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణం. కొంతమంది స్త్రీలకు ప్లాసెంటల్ సమస్యలు ఉండవచ్చు. ఇది నెలలు నిండకుండానే ప్రసవానికి, తక్కువ బరువుకు దారి తీస్తుంది. దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యలకు పరిష్కారం చూపుతాయి. వీటితో పాటు దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.