పిల్లల జీవన నైపుణ్యం పెంచుదాం

 

పిల్లలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, బాగా డబ్బు సంపాదించి సుఖంగా బతకాలి అని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అయితే సుఖంగా బతకటానికి చదువు, ఉద్యోగం, డబ్బు ఇవి మాత్రమే చాలా? జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకోవాలంటే డబ్బు మాత్రమే కాక మరికొన్ని కూడా కావాలి. జీవన నైపుణ్యాలనండి లేదా మరే పేరుతోనైనా పిలవండి. తప్పనిసరిగా ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకి నేర్పించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి పిల్లల వ్యక్తిత్వంలో భాగంగా మారాలంటే తప్పనిసరిగా ఆ పాఠాలు వారి బుడిబుడి అడుగులతోపాటు  మొదలు కావాలి.

నాలుగు గోడల మధ్య మొక్క పెరగదు:

ఎప్పుడు గుర్తుచేసుకున్నా తియ్యటి అనుభూతులు చుట్టుముట్టేలా ఉండాలి వారి బాల్యం. ఆడటం, ఓడటం, ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవటం, పడటం, లేవటం, అన్నీ జీవననైపుణ్యాలే. వాటి నుంచి తప్పించి పిల్లలని నాలుగు గోడల మధ్య పెట్టి జీవితాన్ని జీవించటం ఎలాగో నేర్పించాలనుకోవటం హాస్యాస్పదం కాదంటారా? నాటిన విత్తనం మొలకెత్తి, ఆ మొలక మొక్కై, ఆ మొక్క చెట్టు అయ్యి, ఆ చెట్టు వృక్షంగా మారటం క్రమబద్ధమైన ఎదుగుదలకి, నిలువెత్తు నిదర్సనం. పిల్లలతో ఓ విత్తు నాటిస్తే చాలు ఎదగటమంటే ఎలా వుండాలో వారికి ప్రత్యకంగా నేర్పించక్కరలేదు.

ప్రోత్సహించడం చాలా ముఖ్యం:

ఉద్యోగాల బజార్లో మనల్ని మనం ఒక బ్రాండ్‌గా మార్కెట్ చేసుకోవటానికి మాటకారితనమే పెట్టుబడి. వ్యక్తిగత జీవితానికి మాటే పెట్టని కోట. ఎవర్ని వారు వ్యక్తం చేసుకోవటానికి మాటను మించిన మార్గం వేరే ఏముంది చెప్పండి! మాట్లాడితే నలుగురూ మంత్రం వేసినట్టు వినాలి. ఆ నైపుణ్యం, ఒక్క రోజులో రాదు, సాధన కావాలి. అది చిన్నప్పుడే మొదలు కావాలి. అది అమ్మానాన్నలే ప్రోత్సహించాలి. అందుకే అదుపు, ఆజ్ఞల పేరుతో పిల్లల నోటికి తాళం వేయద్దు. నీకేం తెలీదంటూ మాట్లాడనీకుండా చేయద్దు. వారి ఆత్మ విశ్వాసాన్ని మొగ్గలోనే తుంచేయద్దు. మాట్లాడనీయండి, మనసులోని మాటలు పెదాలు దాటేలా ప్రోత్సహించండి. అస్పష్టమైన భావాలు సృష్టంగా బయట పడటమెలాగో నేర్పించండి. పిల్లలు తమ బలమైన వాదనని వినిపిస్తుంటే ముచ్చటగా చూడండి. ఎందుకంటే ఆ లక్షణమే నలుగురి మధ్య ఉన్నవాడిని నలుగురిని నడిపించేవాడిగా మారుస్తుంది.

సానుకూల దృక్పథం పెంచాలి:


ఇది పిల్లలుగా ఉన్నప్పుడే వారి మనసుల్లో నాటితే వారితో పాటు పెరిగి, పెద్దదవుతుంది. పిల్లలకి గెలవటం ఎంత అవసరమో చెప్పినట్టే ఓడిపోవటం తప్పేంలేదని కూడా కూడా చెప్పాలి. ఆశ పడటం ఎంత బావుంటుందో, సర్దుకు పోవటం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలంగా ఆలోచించటం అలవాటు చేయాలి.  ఆశావాద దృక్పథాన్ని విడకూడదని హెచ్చరించాలి, బుజ్జగించి చెప్పాలి. రోజువారి ఆటపాటల నుంచి పరీక్షల్లో ఫలితాల దాకా ఉదాహరణలని చూపించి చెప్పాలి. చిన్న మనసుల్లో గెలుపు ఓటములు ఏవీ శాశ్వతం కాదని నాటుకుంటే చాలు... సప్త సముదాల అవతల వున్నా ఆ బిడ్డ ఆత్మ స్థైర్యంతో ప్రపంచాన్ని ఎదుర్కోగలడు.

 

-రమ