హెయిర్ పాక్స్!

ఎవరి జుత్తయిన వత్తుగా నిగనిగలాడుతూ ఉంటే మనసు పారేసుకోని  ఆడవాళ్లు ఉండరనటంలో ఆశ్చర్యం లేదు. అలాంటి శిరోజాలు పొడిబారి జీవం లేకుండా ఉంటే బ్యూటి పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హెయిర్ పాక్స్ చేసుకోవటం ఎంతో సులభం. కొంతమంది జుట్టు పొడిబారిపోయి ఉంటే మరికొందరి జిడ్డుగా ఉంటుంది కదా?అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితోనే మళ్లీ అందమైన జుట్టుని తమ సొంతం చేసుకోవచ్చు.

సాధారణ జుట్టుకి సరిపోయే హెయిర్ ప్యాక్:

కేరట్ శరీరానికే కాదు జుట్టుకి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. ఐదు కేరట్ దుంపలని మెత్తగా గ్రైండ్ చేసి పేస్టులాగా తయారుచేసుకోవాలి. ఆ పేస్టుని  జుట్టు మొదళ్ళ నుంచి చివరి దాకా బాగా పట్టించి నలభై నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత చల్లని నీటితో కడగాలి.

జిడ్డుగా ఉండే జుత్తు కోసం(oily hair)
 

మూడు కమలాపండ్ల నుండి తీసిన తొక్కలను(పచ్చివి)  మెత్తగా గ్రైండ్ చేసుకొని, దానిలో ఒక స్పూన్ శెనగపిండి, 1/2 స్పూన్ కాఫీపొడి, ఒక కమలాపండు నుండి తీసిన జ్యూస్ ని అన్నిటిని కలిపి మెత్తటి ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుత్తుకి పట్టించి 25 నిమిషాల పాటు ఉంచి, తరువాత చల్లని నీటితో జుట్టుని కడగాలి.  ఈ విధంగా 15 రోజులకొకసారి మనకి కావలసిన ప్యాక్ ని వేసుకొంటూ ఉంటే జుత్తు అందం రెట్టింపు అవుతుంది.

చుండ్రుని నివారించే హెయిర్ ప్యాక్

గుడ్డులో ఉండే తెల్ల సొనని అరకప్పు పెరుగులో కలిపి అందులో మూడు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ  మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట తర్వాత నీతితో కడగాలి. పదిహేను రోజులకొకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిగనిగలాడే జుట్టు కోసం

నాలుగు స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్టు చేసి అందులో రెండు స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి అరగంట ఆరాకా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా పదిరోజులకి ఒకసారి ఈ ప్యాక్ వెయ్యటం వల్ల జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.

జుట్టుకి ఎప్పుడు హెన్నా పెట్టుకున్నా లేదా ఎలాంటి ప్యాక్ వేసుకున్నా అదే రోజు షాంపూ వాడటం కన్నా మరుసటి రోజు షాంపూ వాడటం మంచిది.జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలకి మనకి అందుబాటులోనే ఎన్నో నివారణలు కూడా ఉంటాయి,వాటిని కాస్త ఓపికతో తెలుసుకుని అప్లై చేసుకుంటే చాలు,ఒత్తుగా నిగనిగలాడే మన జుట్టుని చూసుకుని మనమే మురిసిపోవచ్చు.

- కళ్యాణి