వర్షాకాలం జుట్టు పాడవకుండా ఉండాలంటే..!

 


అసలే వర్షాకాలం.. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు.. అందునా మనం ఎప్పుడైతే గొడుగు తీసుకెళ్లమో అప్పుడే వర్షం పడుతుంది. ఇంకేముంది మొత్తం తడిచిపోతాం. అయితే ఈ వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడవడం వల్ల పలు సమస్యలు వస్తాయి. అలాకాకుండా.. ఈ చినుకుల కాలంలో కూడా జుట్టు మెరిసిపోయేలా చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవెంటే చూద్దాం..

 

* ఈ కాలంలో గోరు వెచ్చని నూనెతో తలకు మసాజ్ చేస్తే చాలా మంచిది. అంతేకాదు ఏదో ఒక్క రకం ఆయిల్ మాత్రమే కాకుండా.. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం ఇలా రెండు మూడు నూనెలు కలిపి ఓ అరగంట తలకు మర్ధన చేసి... మరుసటి ఉదయం తలస్నానం చేస్తే జట్టుకు మంచిది.

 

* ఈ కాలంలో ముఖ్యంగా వేధించే సమస్య చుండ్రు. తల తేమగా ఉండటంతో చుండ్రు, దురద లాంటివి వస్తుంటాయి. వాటిని నివారించడానికి.. నిమ్మ నూనెలో.. టిట్రీ నూనె కలిపి తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుంది.

 

* ఇంకా రెండు చెంచాల వేపపొడిలో రెండు చెంచాల సెనగపిండి వేసి దానిని పేస్టేలా కలిపి తలకు పట్టించి తరువాత నీటితో కడిగేసుకుంటే చుండ్రు, దురద సమస్యలు పోతాయి.

 

* జుట్టు పొడిబారినట్టు అనిపిస్తే తలస్నానానికి ఓ అరగంట ముందు తలకు పెరుగు పట్టిస్తే జుట్టు మెత్తగా మారుతుంది.

 

* నిర్జీవంగా మారిన జుట్టు నిగనిగలాడలంటే.. ఓ గుడ్డు సొనలో.. రెండు చెంచాల బాదం పొడిని కలిపి.. దానికి జుట్టుకు పట్టించి.. ఓ అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.