మహిళలు ఐరన్ లోపాన్ని లైట్ తీసుకుంటే జరిగేది ఇదే..!
.webp)
శరీరానికి ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్ ప్రధమ స్థానంలో ఉంటుంది. మహిళలకు అయినా, పురుషులకు అయినా, పిల్లలకు అయినా, వృద్దులకు అయినా.. ఇలా మానవులందరికీ ఐరన్ చాలా ముఖ్యమైనది. మనిషి శరీరంలో రక్తాన్ని హిమోగ్లోబిన్ ఆధారంగా అంచనా వేస్తారు. మహిళలకు 12 నుండి 16 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అలాగే పురుషులకు 14 నుండి 18 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. కానీ ప్రపంచంలో.. ముఖ్యంగా భారతదేశంలో అధికశాతం మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. దీని వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. భారతదేశంలో 50 శాతం కంటే ఎక్కువ మంది వయోజన మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. చాలామంది తమకు ఐరన్ లోపం ఉందన్న విషయాన్ని తెలుసుకోకుండానే కాలం వెళ్లబుచ్చుతుంటారు. అసలు శరీరానికి ఐరన్ ఎందుకు ముఖ్యం? మహిళలు ఐరన్ లోపాన్ని లైట్ తీసుకుంటే జరిగేదేంటి? తెలుసుకుంటే..
ఐరన్..
ఐరన్ మనిషి శరీరానికి కీలకమైన సూక్ష్మపోషకం. ఇది హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడుతుంది. ఇది శరీరమంతా ఆక్సిజన్ సరఫరా కావడంలో సహాయపడుతుంది. అంటే.. ఐరన్ ఎంత సమృద్దిగా ఉంటే శరీరానికి ఆక్సిజన్ సరఫరా అంత మెరుగ్గా ఉంటుంది.
శరీరంలో ఐరన్ లోపం ఉంటే అది హిమోగ్లోబిన్ తగ్గడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని ఐరన్ లోపం లేదా రక్తహీనత అని అంటారు.
రక్తహీనతను లైట్ తీసుకుంటే..
చాలామంది మహిళలు రక్తహీనతను లైట్ తీసుకుంటారు. తమకు రక్తహీనత సమస్య ఉందని తెలిసినా కొందరు జాగ్రత్తలు తీసుకోవడం, ఐరన్ ఫుడ్ తీసుకోవడం, హిమోగ్లోబిన్ మెరుగు పరుచుకోవడం లాంటివి చేయరు. అయితే రక్తహీనత ఉంటే మహిళలల శరీరం ఎప్పుడూ అలసటగా ఉంటుంది. అలాగే ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం మొదలైన వాటికి కారణం అవుతుంది. ఐరన్ లోపం చాలా ఎక్కువ ఉంటే అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
మహిళల నెలసరి..
మహిళలకు ప్రతి నెల నెలసరి కారణంగా దాదాపు 30 నుండి 40 మిల్లీలీటర్ల రక్తం కోల్పోవడం జరుగుతుంది. పైగా నెలసరి తర్వాత గర్బం దాల్చడం, ప్రసవాలు, గర్భసమస్యలు, సర్జరీలు.. ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా పురుషుల కంటే మహిళలలో రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గర్భధారణ సవాల్..
గర్భధారణ మహిళలకు చాలా సవాల్ విసిరే దశ అనుకోవచ్చు. గర్భం దాల్చినప్పుడు మహిళలకు ఐరన్ అవసరం సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐరన్ కేవలం తల్లికే కాకుండా కడుపులో బిడ్డకు కూడా అవసరం అవుతుంది. అందుకే సాధారణం కంటే 2 లేదా 3 రెట్లు ఐరన్ అవసరం పెరుగుతుంది.
పిల్లలకు పాలిచ్చే తల్లులు..
పిల్లలకు పాలిచ్చే మహిళలు అవసరానికి అనుగుణంగా ఆహారంలో ఐరన్ తీసుకోవాలి. లేకపోతే రక్తహీనత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
గర్బిణీ స్త్రీలు గర్బం దాల్చిన మూడవ నెల నుండి శరీరానికి అవసరమైన ఐరన్ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పాలిచ్చే తల్లులు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ వైద్యుల సలహాతో ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలి.
ఐరన్ లోపానికి ఇలా చెక్ పెట్టాలి..
ఐరన్ లోపాన్ని చెక్ పెట్టడానికి ఆకుకూరలు, గింజలు, బీన్స్, మాంసం, చేపలు, గుడ్లు, బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో తీసుకోవాలి. ఐరన్ సమృద్దిగా లభించే నువ్వులు, వేరుశనగలు, బెల్లం, ఖర్జూరం వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.
కాఫీ, టీ లు మానేయాలి..
చాలామందికి కాఫీ, టీ వంటివి ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే.. ఎక్కువగా తీసుకునే కాఫీ, టీ లు శరీరం ఐరన్ ను గ్రహించకుండా చేస్తాయి. అందుకే శరీరానికి ఐరన్ బాగా లభించాలంటే కాఫీ, టీ తీసుకోవడం పరిమితం చేయాలి. ఇంకా ఆరోగ్యం కోసం అవి కూడా మానేయవచ్చు.
ఐరన్ ను గ్రహించే ఆహారాలు..
విటమిన్-సి ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. అందుకే ఐరన్ తో పాటు నిమ్మ, ఉసిరి, నారింజ, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
*రూపశ్రీ.


.webp)
.webp)