కాబోయే అమ్మలకు వ్యాయామం ముఖ్యమా?


వ్యాయామం అనేది మనిషి తప్పకుండా ప్రతిరోజూ తన దినచర్యలో భాగం చేసుకోవాలి. అయితే వ్యాయామం విషయంలో ఒక్కొక్క పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు ఒక్కో విధమైన నిబంధనలు ఉంటాయి. గర్భం ధరించిన మహిళలు వ్యాయామం చేయవచ్చా.. చేస్తే ఇప్పుడు చెయ్యాలి?? ఎన్ని నెలల సమయంలో మొదలుపెట్టాలి?? ప్రారంభంలోనే వ్యాయామం చేయవచ్చా వంటి ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. 

వ్యాయామం గర్భవతులు కూడా చేయవచ్చు. అయితే గర్భం గురించి తెలిసిన వెంటనే వ్యాయామం మొదలుపెట్టడం ప్రమాదం. గర్భం నిలవాలి అంటే 3 నెలల వరకు విశ్రాంతి తీసుకోవడం, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి 3 నెలల సమయంలో వ్యాయామం జోలికి వెళ్లకూడదు. ఆ తరువాత అంటే 3 నెలల తరువాత వ్యాయామం చేయడం మొదలుపెట్టవచ్చు. నెలలు నిండేకొద్ది మహిళ బరువు, శారీరక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యవంతంగా, బిడ్డకు సరైన విధంగా ప్రాణవాయువు, పోషకాలు అందడనికి కూడా వ్యాయామం సహకరిస్తుంది. శరీరం కూడా భారంగా అనిపించకుండా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. 


గర్భవుతులు పెరిగే బరువును భరించడానికి అనువుగా శరీర కండరాలు, ఎముకల కదలిక సౌకర్యవంతంగా మారుతుంది. అంతే కాదు, కడుపులో పెరుగుతున్న బిడ్డ బరువు వల్ల ఆ ప్రభావం వెన్నుపూస మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకే వెన్ను నొప్పి లేకుండా, మోకాళ్ళ నొప్పులు వంటివి రాకుండా చక్కగా ఉండేలా వ్యాయామాలు దోహదం చేస్తాయి. అంతేకాదు, గర్భవతులు వ్యాయామం చేస్తే డెలివరీ సమయంలో ఆ నొప్పులు భరించడం కష్టతరం అనిపించదు. ఎందుకంటే వ్యాయామం వల్ల శరీరంలో కండరాలు, ఎముకలు దృఢంగా మారి మొత్తం మీద శరీరం గట్టిదనాన్ని పొంది ఉంటుంది. 

అయితే గర్భవతులు విశ్రాంతి తీసుకోవడం ఎలానో.. శ్వాస క్రియ జరపడం ఎలానో కూడా తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల కండరాలు గట్టిపడతాయి. అలాగే వ్యాయామము చేయడానికి ప్రతిరోజు ఒకే సమయాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల శరీర తత్వానికి  మంచి క్రమశిక్షణ అలవడుతుంది. వ్యాయామం చేయడానికి చదునుగా ఉన్న ఉపరితలము గల్గిన స్థలము ఎంచుకోవాలి. అలాంటిచోట మందం పాటి దుప్పటి పరచుకుని దానిమీద వ్యాయామాలు చేస్తుంటారు. అయితే జారకుండా జాగ్రత్తగా ఉండాలి.   


గర్భవతులకు నెలలు నిండేకొద్ది కాళ్ళు వాపు రావడం జరుగుతుంది.  ఈ వాపు తగ్గడానికి కూడా కొన్ని వ్యాయామములు తెలుసుకోవాలి. 


వాపు తగ్గడానికి వ్యాయామం.


 వెల్లకిలా పడుకుని మెల్లిగా కాళ్ళు పైకి ఎత్తాలి. ఆ తరువాత కాలి పాదాలను గుండ్రంగా తిప్పాలి. దీన్ని మొదట గడియారం తిరిగినట్టు తిప్పి, ఆ తరువాత దానికి రివర్స్ లో తిప్పాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళలో వాపులు తగ్గుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్ళ తిమ్మిర్లు తగ్గుతాయి.  కాళ్ళు భారంగా ఉన్న అనుభూతి తగ్గుతుంది. కాబట్టి చిన్న చిన్న తేలికపాటి వ్యాయామాలు చేయడం గర్భవతులు ఆరోగ్యానికి మంచిది.


గమనిక:- గర్భవతులు వైద్యులు, నిపుణుల సలహా లేనిది సొంతంగా వ్యాయామాలు చేయడం తల్లిబిడ్డకు కూడా ప్రమాదం. కాబట్టి వైద్యుల సలహతోనే ఏ వ్యాయామం అయినా చెయ్యాలి.


                                    ◆నిశ్శబ్ద.