జుట్టు... ఇలా చేస్తే పట్టు


వేసవికాలం వచ్చేసింది. వేసవిలో ఎండ తీవ్రత చర్మం మీద ఎంత ఉంటుందో జుట్టు వీుద కూడా దాని ప్రభావం అంతే ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టుకు చెమట పట్టి చాలా చిరాకుగా ఉంటుంది. సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్ కిరణాలు మన జట్టుని పొడిబారిపోయేటట్లు, చిట్లిపోయేటట్లు చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దీనివల్ల మన కురులు పట్టుకుచ్చులా ఉంటాయి.

* వేసవికాలంలో సాధ్యమైనంత వరకూ ఎక్కువ రసాయనాలు ఉన్న షాంపూలు వాడకపోవడమే మంచిది. షీకాకాయ లాంటి వాటితో చేయడం మంచిది.

* వేసవిలో చెమట నుండి జుట్టును రక్షించుకునేందుకు రెండురోజులకోసారి షాంపూ చేసుకోవడం మంచిది. షాంపు చేసిన తరువాత కండీషనర్ రాసుకుంటే జుట్టు తేమగా ఉండి పొడిబారకుండా ఉంటుంది.

* వేసవిలో చెమట కారణంగా చుండ్రు సమస్య ఎక్కువవుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొబ్బరి నూనెను కొంచం వేడి చేసి దానిని తలకు పట్టించి మర్ధనా చేసి ఒక టవల్ తో గట్టిగా చుట్టాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు చుండ్రు సమస్య తగ్గుతుంది.

* ఎండలో బయటకి వెళ్లేముందు జుట్టుకు కొంచం సన్ స్ర్కీన్ లోషన్ రాసుకుంటే ఎండబారినుండి జుట్టును కాపాడుకోవచ్చు. అయితే ఇలా సన్ స్ర్కీన్ లోషన్ రాసుకున్నప్పుడు ఇంటికి రాగానే లేదా పడుకోబోయే ముంది తలస్నానం చేసుకుంటే మంచిది.

* కొబ్బరినీళ్లు, పళ్లరసాలు ఎక్కువగా తాగడం వల్ల కురులు పొడిబారకుండా ఉంటాయి.