మొహాన్ని మెరిపించే  గోల్డ్ ఫేషియల్!

ఈ మధ్య కాలంలో గోల్డ్ ఫేషియల్ చేయించుకోవటం కామన్ అయిపొయింది. ఒకప్పుడు  బంగారం కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అలాంటిది మారుతున్న కాలంతో పాటు బంగారాన్ని వాడే విధానంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

అసలీ గోల్డ్ ఫేషియల్ వల్ల మనకొచ్చే లాభమేంటి అని ఆలోచిస్తే, చాలా లాభాలే ఉన్నాయి అని చెప్పచ్చు. బంగారం పూతలా మొహానికి వేసుకోవటం వల్ల  మొహం మీద వచ్చే ముడతలు మాయం అవుతాయట.  అలాగే  ఏవైనా మచ్చలు ఉన్నా అవి కూడా  క్రమంగా తగ్గుముఖం పడతాయి.

చాలా మందికి చిన్న వయసులోనే వత్తిడి వల్ల మొహం మీద చర్మం జీవం లేకుండా వాడి పోయినట్టు తయారవుతుంది. అలాంటివాళ్ళు ఈ గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే మోహంలో నిగారింపు వచ్చి ఎంతో అందంగా కనపడే అవకాశం ఉంది.

బంగారం వల్ల  ఒంట్లో రక్త ప్రసరణ చక్కగా అయ్యి, శరీరానికి కావాల్సిన ప్రాణవాయువు కూడా తగిన విధంగా అందుతుందిట. బంగారాన్ని ముక్కుపుడకగా కుట్టించుకోవటం వల్ల ఆడవారికి గర్భశోక వ్యాధులు తగ్గుతాయట. అలాగే బంగారు గాజులు, ఉంగరాల వల్ల కూడా అనేక శారీరిక రుగ్మతల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఇక ఈ గోల్డ్ ఫేషియల్ విషయానికి వస్తే ఈ కిట్స్ ఇప్పుడు మార్కెట్ లో విరివిగా దొరుకుతున్నాయి. ఒక కిట్ లో క్లెన్సర్, స్క్రబ్, మాయిశ్చరైజర్, మాస్క్ ఉంటాయి. ఒక మంచి క్వాలిటి కిట్ ని ఇంటికి తెచ్చుకుని మనమే అప్లై చేసుకోవచ్చు కూడా. ఫేషియల్ చేసే ముందు చేతులని శుభ్రంగా కడుగుకోవాలి. ఆ కిట్ లో వాటితో వేరే కంపెనీల ప్రొడక్ట్స్ ని కలపకూడదు.

ముందుగా క్లెన్సర్ తో మొహాన్ని శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుని ఆరనివ్వాలి. అలా ఆరిన తరువాత స్క్రబ్బర్ ని అప్లై చేసి సర్కులర్ మూవ్మెంట్స్ ఇస్తూ మొహాన్ని మసాజ్ చెయ్యాలి. ఇలా చేసేటప్పుడు  మెడని కూడా స్క్రబ్ చేయటం మర్చిపోకండి. అలా ఒక 2 నిమిషాలు చేసాకా గోరు వెచ్చటి నీటితో మొహం కడుక్కుని ఆరనివ్వండి.

గోల్డ్ మాస్క్ ని తీసుకుని మొహం మీద మెల్లిగా వేసి అది ఆరేదాకా ఉంచి తరువాత తీసేసి కాస్త క్రీం రాసుకుంటే చాలు. మొహం బంగారంలా మెరిసిపోతుంది. 3 నెలలకోసారి ఈ ఫేషియల్ చేసుకుంటే చాలు. మరీ తక్కువ వ్యవధిలో అస్తమాట్లు వేసుకోవటం కూడా అంత మంచిది కాదు.

ఇంకేంటి ఆలస్యం మార్కెట్ లో దొరికే బెస్ట్ గోల్డ్ ఫేషియల్ ఏంటో తెలుసుకుని మీ మొహాన్నికూడా బంగారంలా మెరిసిపోయేలా మార్చెయ్యండి.

..కళ్యాణి