గర్భవతులు ఆహారం గురించి అనుమానాలా?? నిజం తెలుసుకోండి!!


జీవితంలో ఏ దశలోనైనా మనం తీసుకునే ఆహారం ముఖ్యమైనది. స్త్రీ గర్భం ధరించినపుడు ఈ మాట మరీ నిజమని ఒప్పుకుంటారు. ఎందుకంటే గర్భవతి తీసుకునే భుజించే ఆహారం కడుపులో బిడ్డకు కూడా పోషకాలను అందించగలగాలి. అయితే అందరూ అనుకున్నట్టు సాధారణ రోజుల్లో తినే దానికి రెట్టింపు గర్భం మోసున్న రోజుల్లో తినాలని అర్థం కాదు. గర్భం దాల్చక ముందు కంటే గర్భం దాల్చిన తరువాత ఎక్కువ తినవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ క్రొవ్వు పట్టేంతగా తినకూడదు క్రొవ్వు ఎక్కువైతే గర్భవతులు ప్రసవం కష్టమవుతుంది. అదీకాక ఈ అదనపు క్రొవ్వును కరిగించడానికి చాల కష్టపడవలసి వస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు  ఆహారం విషయంలోనే కాదు, బరువు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 


గర్భిణీ స్త్రీలు డాక్టర్ల దగ్గరకు టెస్టుల కోసం వెళ్లినపుడు అక్కడ బరువు చూడటం అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు డాక్టర్లే బరువు తగ్గడం, పెరగడం అనే విషయాల గురించి చెబుతాడు. బరువు విషయంలో తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. గర్భవతులు అందరికీ వర్తించే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు ఉంటాయి. జ్యుస్ లు, లిక్విడ్స్,  మొదలైనవి  గర్భిణీ స్త్రీలు  కావలసినన్ని తీసుకోవాలి. అయితే వీటి తయారీకి పంచదార ఉపయోగించకూడదు చక్కెర అదనంగా తింటే క్యాలరీలు పెరిగి శరీరం బరువు ఎక్కువ ఆవుతుంది. మామూలుగా ఉన్న బరువుకు గర్భవతిగా వున్న సమయములో నున్న బరువుకు 20 కిలోల కంటే ఎక్కువ తేడా వుండకూడాదు. ఇంతకంటే ఎక్కువ బరువు వుండటం మంచిది కాదు.


గర్భిణీ స్త్రీ తినే తిండిని బట్టే బిడ్డ పెరుగుతుంది. అందువల్ల తినే తిండి నాణ్యతగా ఉండాలి.. తల్లీ బిడ్డకు ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని ఎన్నిక చేసుకోవాలి. తినే ఈ భోజనం ఎంపిక చేసుకున్న ఆహార పదార్థాల నుండి తయారు చేయాలి. పోషణ పదార్థాలు గల ఆహారాన్ని తీసుకుంటే కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా, బలంగా పెరుగుతాడు.


విటమినులు, ఖనిజలవణాలు లోపించిన ఆహారాన్ని ఎన్నిక చేసుకున్నట్లయితే బిడ్డ ఆరోగ్యము నష్టానికి గురి అవుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. సారం లేని భోజనం ఎముకలు దంతాల పెరుగుదలను అరికడుతుంది. బిడ్డ దేహంలో నిరోధక శక్తి తగ్గి పుట్టిన తరువాత ప్రమాదకరమైన రోగాలకు గురి అవుతాడు. సారం లేని ఆహారం తీసుకున్న స్త్రీ గర్భవతిగా ఉన్నంత కాలము ప్రసవ సమయంలోను కష్టపడవలసి వస్తుంది. బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లికి శక్తి లేకుండా పోతుంది.


గర్భిణీ స్త్రీ గర్భంలో బిడ్డ వేగంగా వృద్ధి పొందుతూ వుంటాడు. సరైన పెరుగుదలకు పోషకాలు విటమిన్లు బిడ్డకు అవసరమవుతాయి. విటమినులు కొన్ని మన శరీరంలో నిల్వ ఉండవు. అందువల్ల ఈ విటమినులలో గల ఆహార పదార్థాలు ప్రతిరోజూ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీకి విటమినులు గల ఆహారం చాలా మేలు కలుగజేస్తుంది.


                                      ◆నిశ్శబ్ద.