తులసి వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు!
భారతీయుల జీవితంలో తులసి అనేది చాలా ప్రత్యేకమైనది. అది కేవలం దైవ సంబంధమైన మొక్కగానే కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించే అద్భుత సంజీవనిగా కూడా అందరికి తెలుసు. మన రోజు వారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరిమికొట్టడంతో పాటు మొండి రోగాలను, ఎంతో తీవ్రమైన జబ్బులను నెమ్మదిగా తగ్గుముఖం పట్టించడంలో తులసి చాలా గొప్పగా పనిచేస్తుంది. అయితే అమ్మాయిలు సాధారణంగా సౌందర్యాన్ని పెంచుకోవాలని అనుకుంటే వారు తమ సహజమైన బ్యూటీ థెరపిలో కచ్చితంగా తులసిని భాగం చేసుకోవాలి. తులసి శరీరం లోపలి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శరీరం పైన చర్మాన్ని కూడా చక్కదిద్దగలదు. అంతర్గతంగా, బాహ్యంగా శరీరాన్ని శుద్ధి చేసే తులసి గ్రేట్ మెడిసిన్.
తులసి చర్మానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పొడి, సున్నితమైన చర్మం మీద వచ్చే మొటిమలను, వయసు రీత్యా ఏర్పడే ముడుతలను తగ్గించడంలో తులసిది శక్తివంతమైన పాత్ర. తులసిని రోజువారీ చర్మ సంరక్షణలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే చాలామంది స్కిన్ స్పెసిషలిస్ట్స్ తులసిని రోజులో భాగం చేసుకోమని కూడా సలహా ఇస్తున్నారు. ఏ రకమైన తులసి అయినా గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఏ రకమైన తులసి ఉపయోగించాలనే సంశయం కూడా వద్దు.
అమ్మాయిలకు తులసితో అద్భుతమైన అయిదు ప్రయోజనాలు ఇవిగో...
యాంటీ ఏజింగ్ లక్షణాలు
తులసిలో యాంటీఆక్సిడెంట్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్ స్కిన్‌కేర్ రొటీన్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మం దెబ్బతినకుండా నిరోధించడంలో తులసి సహాయపడుతుంది. ఇందులోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ చర్మం మీద వచ్చే వాపు మరియు ఎరుపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఈ రెండూ వృద్ధాప్యం రావడానికి దోహదం చేస్తాయి. తులసి రసం లేదా నూనెతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
మొటిమల చికిత్స
తులసి మొక్క సహజ యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలకు సమర్థవంతమైన చికిత్స చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా, ఇది మొటిమలకు కారణమయ్యే క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండ మొటిమలు వచ్చినప్పుడు మొటిమల తాలూకూ నొప్పి, మంట తగ్గించడానికి, చర్మ రంధ్రాలను అన్ లాగ్ చేయడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలలో దుమ్ము, ధూళి, మురికి మొదలైనవి చేరడం మొటిమలకు దోహదపడే కారకాలు. తులసిని రోజులో చేర్చడం ద్వారా మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మళ్ళీ మొటిమలు రాకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది.
చర్మానికి మెరుపును ఇస్తుంది
తులసిలో అధిక స్థాయిలో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది డార్క్ స్పాట్స్ మరియు హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. అలాగే చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి, చర్మం రంగు వెలసిపోకుండా మెరుస్తూ సహాయపడుతుంది. సాధారణ స్కిన్ కేర్ కంటే తులసిని అందులో భాగం చేసుకుని ఉపయోగించడం వల్ల చర్మానికి అధిక కాంతి, ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. నిస్తేజంగా ఉన్న చర్మాన్ని ఆక్టివేట్ చేస్తుంది.
మాయిశ్చరైజింగ్
తులసితో ఉన్న మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా, చర్మాన్ని తేమగా, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి లోతైన పోషణను అందించగల ముఖ్యమైన నూనెలను కలిగి ఉంటుంది, ఇది పొడి చర్మం ఉన్నవారు ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన, తేమతో కూడిన చర్మం కావాలంటే తులసి బెస్ట్ ఆప్షన్.
విశ్రాంతిని ఇస్తుంది
తులసిలో ఉన్న సహజమైన గుణాలు ఉన్నాయి, చర్మపు చికాకును తగ్గించి ప్రశాంతంగా ఉంచడానికి , ఉపశమనానికి సహాయపడతాయి. ఇది యూజెనాల్‌ను కలిగి ఉంటుంది, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు అనాల్జేసిక్ లక్షణాలతో కూడిన సమ్మేళనం. ఇదే చర్మాన్ని విశ్రాంత స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది.
ఇలా తులసి చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది.
◆నిశ్శబ్ద.