
చర్మం తాజాగా కనిపించాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా కూడా రకరకాల రసాయనాలను వాడుతుంటాం. వాటి కోసం చాలా డబ్బుని వృధా చేస్తుంటాం. మరి అలా కాకుండా మన వంటిట్లో ఉండే వస్తువులతోనే మన చర్మం అందంగా, తాజాగా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందామా..!
నారింజ పండు తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకొని, దానిని పెరుగులో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పొడి చర్మానికి పుదీనా ఆకులతో చేసిన టోనర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గుప్పెడు పుదీనా ఆకులు తీసుకుని, నీటిలో మరిగించాలి. కాస్త వేడి చల్లారాక నేరుగా ముఖానికి రాసుకుని, ఆరాక శుభ్రపరుచుకోవాలి. లేదంటే ఆ ద్రవాన్నిఓ ఐస్ ట్రేలో పోసి డీప్ ఫ్రిజ్ లో ఉంచితే, ఐసు ముక్కల్ని అలంకరణకి ముందు ముఖానికి రుద్దుకోవచ్చు. ఒక కోడిగుడ్డు సొనకి చెంచా నిమ్మరసం, తేనే కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెంతుల్ని ముందురోజు రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తగా చేసుకోవాలి. దీనికి పెద్ద చెంచా తేనే కలుపుకొని ముఖానికి పూతలా వేసుకొని అరగంటయ్యక కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా కనిపించడం ఖాయం.



