ఫేస్ క్లీనిసింగ్ టిప్స్



కాలుష్యం.. కాలుష్యం.. ఈరోజుల్లో అడుగు బయటపెట్టామంటే కాలుష్యంలోకి అడుగు పెట్టామన్నమాటే. ఈ కాలుష్యం వల్ల బాగా ప్రభావితం అయ్యే మన శరీర భాగాల్లో ముఖం చాలా ముఖ్యమైనది. ముఖం మీద కాలుష్యం పేరుకుపోతే అది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం వుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం వుండే అమ్మాయిలు తమ ముఖాన్ని కాపాడుకోవాలి.. ముఖాన్ని శుభ్రం చేసుకునే విషయంలో అదనపు శ్రద్ధ చూపించాలి. సరైన పద్ధతిలో ముఖాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల కాలుష్యం, మురికి ముఖాన్ని వదిలిపోవడం మాత్రమే కాకుండా ముఖంలోని స్కిన్ సెల్స్ నిరంతరం ఆరోగ్యంగా వుంటాయి. తద్వారా అందంతోపాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. ఇప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవడంలో అనుసరించాల్సిన కొన్ని టిప్స్ మీకోసం....

1. మీది ఎలాంటి తరహా చర్మమైనా రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. అంతకు మించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ శుభ్రం చేసుకున్నా మంచిది కాదు. ఎందుకంటే, శరీరం మీద వుండే నేచురల్ ఆయిల్స్ పోతాయి.

2. మీ శరీర తత్వానికి సరిపోయే క్లిన్సర్లను మాత్రమే ఉపయోగించాలి. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బులను ఉపయోగించడం తగ్గిస్తే మంచింది.

3. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే నీరు గోరు వెచ్చగా వుంటే మంచింది. బాగా వేడినీరుగానీ, బాగా చల్లగా వుండే నీరుగానీ శ్రేయస్కరం కాదు.

4. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి వాష్ క్లాత్, స్పాంజ్ ఉపయోగించేవారు అవి శుభ్రంగా వున్నాయా లేదా అనే విషయాన్ని ముందుగానే పరీక్షించుకోవాలి. అపరిశుభ్రంగా వున్నవాటిని ఉపయోగించడం మంచిది కాదు.

5. ముఖాన్ని కడుక్కునే ముందు మీ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే హెడ్ బ్యాండ్ కూడా వేసుకోవాలి. ముఖం కడుక్కునే సమయంలో జుట్టు ముఖం మీద పడకుండా జాగ్రత్తపడాలి.

6. మొదట ముఖం మీద నీళ్ళు వేగంగా చల్లుకుని ముఖాన్ని కడుక్కోవడం ప్రారంభించాలి. ముఖం మాత్రమే కాదు.. మెడను కూడా శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు.

7. చేతిలోగానీ, స్పాంజ్ మీద గానీ క్లినసర్‌ తీసుకుని దాన్ని ముఖం మీద కింద నుంచి పైకి రుద్దుకోవాలి. అలాగే మెడ మీద కూడా క్లినసర్ ఉపయోగించాలి. ముఖం మీద చాలా సున్నితంగా ఒత్తిడి కలిగించాలి. గట్టిగా రుద్దడం వల్ల చర్మం పాడవుతుంది. ముఖం కడిగే సమయంలో కళ్ళ చుట్టూ చాలా మృదువుగా రుద్దాలి.

8. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి క్లినసర్ ఉపయోగించినప్పుడు, ముఖానికి అప్లయ్ చేసిన క్లినసర్ మొత్తం పోయేలా గోరువెచ్చని నీటితో కడగాలి. అరకొరగా కడగడం మంచిది కాదు.

9. ముఖాన్నిశుభ్రం చేసుకున్న తర్వాత టవల్‌తో తుడుచుకునే పద్ధతి కూడా చాలా ముఖ్యం. టవల్‌తో చాలా మృదువుగా ముఖం మీద అద్దుకోవాలంతే. టవల్ని ముఖం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా అదిమిపెట్టి రుద్దకూడదు.

10. ముఖాన్ని నీటితో, క్లినసర్‌తో శుభ్రం చేసుకుని, టవల్‌తో తుడుచుకున్న తర్వాత వాటర్‌ బేస్‌తో వుంటే టోనర్లను ముఖానికి రాసుకోవాలి. ఇది ముఖం మీద వుండే సహజమైన తేమను నిలుపుతుంది.