పిల్లలకు ప్రేమతో....
వాలెంటైన్స్ డే ........ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ప్రేమలోకంలో కుర్రకారుని ఉర్రూతలూగించె రోజు. ఇది కేవలం టీనేజర్స్ ని మాత్రమే కాదు ఇంకా టేనేజ్ లోకి అడుగుపెట్టని పిల్లల్ని సైతం తన ప్రభావంతో ఉయ్యలలూగిస్తోంది. తెలిసి తెలియని అమాయకత్వంతో అయోమయంలో పడే పిల్లలకి తల్లితండ్రులు ఇచ్చేకొద్దిపాటి అవగాహన చాలు. వాళ్ళు దారితప్పి తప్పటడుగు వేయకుండా చూసుకోటానికి.
పిల్లల మనసులు ఎలా ఉన్నా ఇలాంటి పోకడలతో తమ పిల్లలు ఎక్కడ చేయిజారిపోతారో లేదా వాళ్ళకి తెలియకుండానే ఏదైనా తప్పుడు మార్గాన్ని అనుసరిస్తారేమో అనే భయం చాల మంది పేరెంట్స్ కి ఉంటుంది. ముందు మీలో ఉన్న ఆ భయాన్ని, టెన్షన్ ని పక్కన పెట్టేయండి. హాయిగా వాళ్లతో మాటామాట కలుపుతూ మాటల్లో వాలెంటైన్స్ డే ప్రత్యేకతని వాళ్ళ వయసువారికి అర్ధమయ్యే రీతిలో చెప్పటం మొదలుపెడితే మంచి ఫలితం కనిపిస్తుంది. మీరే వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అనే అభిప్రాయాన్ని వారిపై రుద్ది , ఆ రోజు ఇలా చెయ్యకు అలా చెయ్యకు, బయటకి వెళ్ళకు అంటూ నిబందనలు పెట్టకండి. మనం ఏదైతే వద్దు అంటామో దాని మీదే పిల్లల ఆసక్తి పెరుగుతుంది. ఆ విషయం గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపన మొదలవుతుంది. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండమని హెచ్చరించటం కాకుండా వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పటం ఉత్తమం.
వాలెంటైన్స్ డే అంటే మనని ఇష్టపడేవారికి,మనం ఇష్టపడేవారికి మన కృతజ్ఞతని తెలిపే రోజుగా పిల్లలకి ఈ రోజుని పరిచయం చెయ్యండి. ఎదుటివారు మన మీద చూపించే ప్రేమకి మనం తిరిగి ఏమిచ్చినా తక్కువే కదా!అందుకే మన ఇష్టాన్ని వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనివ్వటం ద్వారా గానీ లేదా ఒక చిన్న మెసేజ్ ఉన్న గ్రీటింగ్ కార్డు కొన్నివటం ద్వారా గాని తెలియచేయ్యచ్చు అనే విషయాన్నీ సున్నితంగా వివరిచండి. ఒక గిఫ్ట్ కొని దానిని అమ్మమ్మకి,మామయ్యకి,చెల్లెలకి లేదా అన్నయ్యకి మీరే మీ చేతులతో ఇప్పించి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పించండి.ఒక వస్తువు కొని దానిని ఎదుటివారికి ఇస్తే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఎప్పటికి మీ ఆలోచనలకి అతీతంగా ప్రవర్తించరు. ఈ కాన్సెప్ట్ పిల్లల మనసుకి అర్ధమయ్యేలా మనం చెప్పగలిగితే వాళ్ళు మొదటిగా ఇచ్చె వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డు మీదే కావచ్చు.
--కళ్యాణి