తారాగణం: అమితాబ్ బచ్చన్, హేమమాలిని, సల్మాన్ ఖాన్, మహిమా చౌదరి, పరేష్ రావల్, లిలెట్ దూబే, అమన్ వర్మ
సంగీతం: ఆదేశ్ శ్రీవాస్తవ
దర్శకత్వం: రవి చోప్రా
వృద్ధాప్యంలో ఉన్న ఎంతోమంది వ్యక్తులు - అరే! ఇది దాదాపు మా కథలాగే ఉందే! అనుకునే చిత్రంగా 'బాగ్‌బన్'ని చెప్పుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించే పిల్లల్ని తలలు దించుకునేట్లుగా చేసిన సినిమా కూడా. 'బాగ్‌బన్'ని చూస్తున్నంత సేపూ హృదయాలతో పాటు కళ్లూ తడవుతాయి. వాస్తవానికి ఈ చిత్ర కథ కొత్తదేమీ కాదు. సమాజంలో ఎంతో కాలం నుంచీ జరుగుతున్న వాస్తవం. తమ పిల్లలకు బంగారు భవిష్యత్తుని అందించాలనే తపనతో తమ జీవితాల్ని త్యాగం చేసిన తల్లిదండ్రుల కథ ఇది. వయసు మళ్లాక అదే పిల్లల చేత నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రుల కథ ఇది. ఈ అంశంతో గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయినా ఇందులో ఎంతో కొంత వైవిధ్యం అగుపించిందంటే అందుకు ప్రధాన కారణం రెండు ప్రధాన పాత్రల మధ్య సాగుతూ వచ్చే ప్రేమానుబంధం.
పెళ్లయిన 40 ఏళ్ల తర్వాత సైతం రాజ్ మల్హోత్రా (అమితాబ్ బచ్చన్), పూజ (హేమమాలిని) పరస్పరం అపురూపమైన అనురాగాన్ని కలిగి ఉంటారు. అనేక ఇతర సినిమాల్లో మాదిరిగానే వాళ్లు కూడా పాడతారు, డాన్సులు చేస్తారు. పెళ్లయిన వాళ్ల నలుగురు కొడుకులు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు (వాళ్ల కోసం తన ఆఖరి సంపాదనను కూడా రాజ్ వెచ్చిస్తాడు). రాజ్ రిటైరయ్యే దాకా అంతా బాగానే ఉంటుంది. ఇక తమ తల్లిదండ్రుల బాధ్యతని కొడుకులు చేపట్టే టైమ్ వస్తుంది. ఐతే నలుగురు కొడుకుల్లో ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని తమ వద్ద ఉంచుకోడానికి ముందుకు రారు. కారణం సింపుల్.. రాజ్ దగ్గర డబ్బేమీ లేకపోవడం.
చివరికి ఆ కొడుకులు ఓ పరిష్కారానికి వస్తారు. ఒక్కో కొడుకూ తల్లిదండ్రుల్లో ఒకర్ని మాత్రం ఆరు నెలల పాటు పోషించడం.. ఆ పరిష్కారం. ఈ ఆలోచనకు సహజంగానే అయిష్టతను చూపుతాడు రాజ్. వాళ్లు మన ప్రేమను పంచుకోవాలని అనుకోవడం లేదు. మనల్ని విడదీయాలని అనుకుంటున్నారు అని పూజతో చెబుతాడు. తన కొడుకులు నిర్దయులని అంగీకరించడానికి పూజ తల్లి మనసు అంగీకరించదు. తన కొడుకులు అలాంటివాళ్లు కాదంటుందామె. ఇద్దరూ విడివడి చెరో కొడుకు దగ్గరకు వెళ్తారు. కానీ ఇద్దరిలో ఎవరూ సంతోషంగా గడపలేకపోతారు. కొడుకులు వారి పట్ల కఠినంగా, ఛీత్కార ధోరణితో వ్యవహరిస్తారు.
అనంతరం వాళ్ల పెంపుడు కొడుకు అలోక్ (సల్మాన్ ఖాన్) ప్రవేశిస్తాడు. రాజ్ దంపతుల మూలంగా ఉన్నత చదువు చదువుకున్న అతడు మంచి సంస్కారి. వాళ్లను తన దగ్గరకు రమ్మంటాడు. రోజూ ఉదయాన్నే తాను పూజించే దేవుళ్ల సరసన రాజ్ దంపతుల ఫొటోని పెట్టుకునేంత ప్రేమ, భక్తి అతనిది. అతని ప్రేమలో ఎలాంటి షరతులూ ఉండవు. మరోవైపు రాజ్ జీవితంలో హేమంత్ పటేల్ (పరేష్ రావల్), అతని భార్య శాంతి (లిలెట్ దూబే) ముఖ్యమైన భాగంగా మారతారు. అలోక్, అతని భార్య అర్పిత (మహిమా చౌదరి) ప్రేమను కొద్ది కాలం ఆస్వాదించాక రాజ్, పూజ తమ పాత ఇంటికి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంటారు. ఉదర పోషణ నిమిత్తం ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటాడు రాజ్. అయితే పరిస్థితులు ఒక్కసారిగా ఊహాతీతంగా మారిపోతాయి. తన జీవితంపై అతను రాసుకున్న బాగ్‌బన్ నవల ప్రచురణకు నోచుకుంటుంది. పబ్లిషర్ల దగ్గర్నుంచి 10 లక్షల రూపాయల అడ్వాన్స్ చెక్కుని తీసుకొని రాజ్ దగ్గరకు వస్తాడు హేమంత్ పటేల్. ఆఖరుకి ఆ నవల ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను సైతం గెలుచుకుంటుంది. రాజ్ మల్హోత్రా పేరు ప్రఖ్యాతులు అమాంతం పెరిగిపోతాయి (శోభన్‌బాబు నటించిన మహారాజు గుర్తుకు వస్తోంది కదూ!).
ఉన్నత భావోద్వేగాల మేళవింపుగా 'బాగ్‌బన్' మూవీని చెప్పుకోవచ్చు. కథలో కొన్ని లాజిక్‌కు అందని అంశాలున్నా, క్లైమాక్స్ వరకూ మనల్ని కట్టిపడేసే, హృదయానికి హత్తుకొనే అనేక సన్నివేశాలను దర్శకుడు రవి చోప్రా కల్పించాడు. ఒక్కమాటలో ఈ మూవీని ఆయన అమితాబ్, హేమమాలిని కోసమే తీశాడనిపిస్తుంది. రాజ్ క్యారెక్టర్ అమితాబ్ మాత్రమే చేయగల టైలర్ మేడ్ క్యారెక్టర్. ఆయన దానిలో అనాయాసంగా ఇమిడిపోయారు. ఆయన పాడారు, డాన్సులు చేశారు, రొమాన్స్ చేశారు, ఏడ్చారు, చూసేవాళ్లను ఏడ్పించారు. ఈ సినిమా చేసే సమయానికి నడివయసు దాటుతున్నన హేమమాలిని సౌందర్యం చెక్కుచెదరలేదనిపిస్తుంది.
తన ఉన్నతికి తోడ్పడ్డ పెంపుడు తల్లిదండ్రులపై అలోక్ చూపించే అనురాగం మనల్ని కదిలిస్తుంది. తెరమీద కనిపించేది కొద్దిసేపే అయినా సల్మాన్, మహిమా చౌదరి స్పెషల్ అప్పీరెన్స్ అనే మాటకు న్యాయం చేశారు. పరేష్ రావల్, లిలెట్ దూబే కీలక పాత్రలు పోషించి వినోదాన్ని పంచారు. ఆదేశ్ శ్రీవాస్తవ సంగీతం బాగ్‌బన్‌కు ఓ ఎస్సెట్. ఇందులో అమితాబ్ నాలుగు పాటలు పాడటం విశేషం. హేమతో ఫోన్‌లో పాడే "మై యహా తూ వహా" సాంగ్ మనసుని పిండేస్తుంది. ఈ పాట చూస్తుంటే యాదృచ్ఛికంగా 'మహాన్' మూవీ గుర్తుకురాక మానదు. అందులోనూ ఫోన్‌లో వహీదా రెహమాన్‌తో "జిధర్ దే ఖూ తేరీ తస్వీర్ నజర్ ఆతీ హై" అని పాడతారు అమితాబ్.