రామ్‌గోపాల్ వర్మ స్టైలే వేరని మనకు తెలుసు కదా.. దేనికీ, ఎవరికీ కమిట్ అవని మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తను చేయాలనుకున్నది చేయడం, తను మాట్లాడాలనుకున్నది మాట్లాడటం ఆయన నైజం. తాజాగా తనేమిటో 'బాహుబలి' డైరెక్టర్ యస్.యస్. రాజమౌళికి రుచి చూపించారు వర్మ. ఆయన గురించి రాజమౌళికి తెలీదనుకోలేం. అయినప్పటికీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆయనకు విసిరి బొక్కబోర్లాపడ్డారు రాజమౌళి.
రామ్‌చరణ్ తనకు విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను టేకప్ చేసిన రాజమౌళి బుధవారం తనతో పాటు తన 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్‌ను కూడా అందులో భాగస్వాములుగా చేసి, తమ షూటింగ్ లొకేషన్ దగ్గరే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత ఆ చాలెంజ్‌ను ముగ్గురు దర్శకులు.. ఆర్జీవీ, వినాయక్, పూరి జగన్నాథ్‌లకు విసిరారు. అయితే ఆర్జీవీ సంగతి తెలిసిందేగా.. దానికి తనదైన స్టైల్‌లో ఆయన స్పందించారు.
రాజమౌళి పోస్ట్‌ను రిట్వీట్ చేసిన ఆర్జీవీ "సర్ రాజమౌళి.. నేను గ్రీన్‌లోకి రాను, ఛాలెంజ్‌లలోకి రాను. మట్టిని ముట్టుకోవడాన్ని నేను ద్వేషిస్తాను. మొక్కలు మరింత బెటర్ పర్సన్‌కు అర్హమైనవి నాలాంటి స్వార్థపరుడికి కాదు. మీకు, మీ మొక్కలకు ఆల్ ద బెస్ట్" అని సమాధానమిచ్చారు. దటీజ్ రామ్‌గోపాల్ వర్మ!