స్టార్లుగా వెండితెరపై వెలుగుతున్న చాలా మంది హీరో హీరోయిన్లుగా పరిచయమైన మొదటి సినిమాలనే ప్రస్తావిస్తుంటారు గానీ అంతకు ముందు వేసిన చిన్నా చితక పాత్రల గురించి పెద్దగా చెప్పుకోరు. వారు ఫలానా సినిమాలో ఫలానా పాత్రలో మెరిసి మాయమయ్యారంటే ఔనా అని ఆశ్చర్యపోక తప్పదు. ఉదాహరణకు తొమ్మిదేళ్లప్పుడే ఊర్మిళా మటోండ్కర్ ప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కపూర్ తీసిన 'మాసూమ్' మూవీలో నసీరుద్దీన్ షా కూతురు పింకీగా నటించింది. 'యాదోంకీ బరాత్' సినిమాలో చిన్నప్పటి అన్నదమ్ముల్లో ఆమిర్ ఖాన్ కూడా ఒకడు.
'హమ్ నౌజవాన్' మూవీలో దేవానంద్ టీనేజ్ కుమార్తె మరెవరో కాదు.. టబు. 'భగవాన్ దాదా' చిత్రంలో రజనీకాంత్ దత్తపుత్రుడిగా హృతిక్ రోషన్ కనిపిస్తే, 'ఖయామత్ సే ఖయామత్ తక్', 'జో జీతా వహీ సికిందర్‌లో' చిన్నప్పటి ఆమిర్ ఖాన్‌గా ఆయన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ నటించాడు. జీనత్ అమన్‌కు క్రేజ్ తీసుకొచ్చిన 'సత్యం శివం సుందరం' చిత్రంలో చిన్నప్పటి జీనత్‌గా కనిపించింది ఎవరో కాదు.. పద్మినీ కొల్హాపురి. అఫ్తాబ్ శివ్‌దాసానీ 'మిస్టర్ ఇండియా'లో అనాథ బాలుడిగా, 'చాల్‌బాజ్' మూవీలో శ్రీదేవి చిట్టితమ్ముడిగా కనిపించాడు.