ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత దర్శకుడు అలన్ పార్కర్ సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో పోరాటం చేస్తూ శుక్రవారం మృతి చెందారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. డైరెక్టర్‌గా రెండు సార్లు అస్కార్ నామినేషన్ పొందిన ఆయన మిడ్‌నైట్ ఎక్స్‌ప్రెస్, మిసిస్సిపి బర్నింగ్, ఫేమ్, బగ్సీ మలోన్, ద కమిట్‌మెంట్ లాంటి క్లాసిక్ మూవీస్‌ను రూపొందించారు. మడోన్నా నటించిన బిగ్ బడ్జెట్ పాపులర్ ఫిల్మ్ 'ఎవిటా' డైరెక్టర్ కూడా ఆయనే.
బ్రహ్మాండంగా సాగిన కెరీర్‌లో ఆయన రూపొందించిన సినిమాలు 19 బాఫ్టా అవార్డులు, 10 గోల్డెన్ గ్లోబ్‌లు, 10 ఆస్కార్‌లు గెలుచుకోవడం విశేషం. డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వ్యవస్థాపక సభ్యుడైన పార్కర్ యు.కె. ఫిల్మ్ ఇండస్ట్రీకి తన వంతు సపోర్ట్‌ను అందించారు. 2000 సంవత్సరంలో ఏర్పాటైన యు.కె. ఫిల్మ్ కౌన్సిల్‌కు ఆయన వ్యవస్థాపక చైర్మన్. 2002లో నైట్‌హుడ్ పురస్కారం అందుకున్నారు. 1975లో రచన చేసి దర్శకత్వం వహించిన 'బగ్సీ మలోన్' సినిమా ఆయన తొలి ఫీచర్ ఫిల్మ్.