ఎవరైనా సావిత్రి అనే పేరు చెబితే చాలు.. వెంటనే వచ్చే స్పందన.. "మహానటి సావిత్రా" అని. అవును.. మహానటి అనే విశేషణం జోడించకుండా సావిత్రి పేరు పలకలేం. అంత గొప్ప నటిగా అశేష తెలుగు ప్రజానీకం హృదయాల్లో ఆమె రూపం ముద్రించుకుపోయింది. ఆమె బయోపిక్‌గా వచ్చిన 'మహానటి' సినిమా సైతం ఎంత గొప్పగా ఆడిందో మన జనరేషన్ చూసింది. సావిత్రి జ్ఞాపకంగా ఆమె కుమార్తె విజయచాముండేశ్వరి ఉన్నారు. అయితే ఆమె సినిమా ఫీల్డ్‌కు దూరంగా ఉండిపోయారు. కానీ ఆమె కుమారుడు.. అంటే సావిత్రి మనవడు అభినయ్ వడ్డి మాత్రం అమ్మమ్మ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి నటుడిగా సినిమాల్లోకి వచ్చిన విషయం కొంతమందికి తెలుసు.
పదేళ్ల క్రితమే దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన 'యంగ్ ఇండియా'తో అభినయ్ తెరంగేట్రం చేశాడు. అప్పుడతను బాగా కుర్రాడు. ఆ సినిమా వచ్చిన నాలుగేళ్ల తర్వాత, ప్రఖ్యాత మేథమెటీషియన్ శ్రీనివాస రామానుజన్ బయోపిక్‌గా వచ్చిన తమిళ చిత్రం 'రామానుజ'న్‌లో టైటిల్ రోల్ పోషించిన ఆకట్టుకున్నాడు అభినయ్. స్ఫురద్రూపం, చక్కని నటనతో భవిష్యత్ ఉన్న నటుడని ప్రశంసలు పొందాడు. అయితే కెరీర్ అతడికి పూలపాన్పు కాలేదు. వెంటవెంటనే అవకాశాలు అతడిని వెతుక్కుంటూ రాలేదు. 2016లో 'చెన్నై 600028 II' అనే స్పోర్ట్స్ డ్రామా చేసిన అతను, గత ఏడాది 'విలంబరమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఆ సినిమా 2012లోనే మొదలైనా, 2019లో విడుదలైంది. అందులో అతని జోడీగా ఐశ్వర్యా రాజేశ్ నటించడం గమనార్హం.
ఆ సినిమా తరహాలోనే 'మైఖెలగియ నాన్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ ఆరేళ్లుగా విడుదల కాకుండా ఆగిపోయింది. గత ఏడాది సిమ్రాన్, త్రిష ప్రధాన పాత్రధారులుగా మొదలైన 'సుగర్' అనే మరో తమిళ సినిమాలోనూ అతను నటిస్తున్నాడు. అది విడుదల కావాల్సి ఉంది. తమిళ చిత్రసీమలో అతడికి అడపా దడపా అవకాశాలు వస్తున్నా టాలీవుడ్ మాత్రం అతడిని పూర్తిగా విస్మరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. నటుడిగా ఎలాగైనా పేరు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉన్న సావిత్రి మనవడి వైపు మన దర్శక నిర్మాతలు దృష్టి సారిస్తారా?