కృష్ణవంశీ మూవీ 'ఖడ్గం'తో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీగా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్‌కు అసలైన టర్నింగ్ పాయింట్ లభించింది గోపీచంద్ సినిమా 'లౌక్యం'తోటే. ఆ సినిమా నుంచే బ్రహ్మానందంకు ప్రత్నామ్నాయ నటుడు లభించాడని డైరెక్టర్లు నమ్మారు. వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఫలితం.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఆయనకు ఎస్వీబీసీ (శ్రీ వేంకటేశ్వరా భక్తి చానల్) ఛైర్మన్ పదవి లభించింది. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగా నిలవడం వేరే సంగతి.
చాలా మందికి తెలీని విషయం.. 1989లోనే పృథ్వీ 'గండిపేట రహస్యం' అనే సినిమాలో మండలాధీశుడు భీమారావు పాత్రను ఆయన చేశారనే విషయం. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన మండల వ్యవస్థకు వ్యతిరేకంగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎం. ప్రభాకర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో రామారావును పోలిన పాత్రను పృథ్వీ పోషించారు. కానీ ఆ సినిమా గురించి అడిగితే మాత్రం పృథ్వీ తప్పించుకుంటారు. కాంట్రవర్సీలోకి వెళ్లడం దేనికని దాట వేస్తారు.
నిజానికి అంతకంటే ముందే.. 1987లోనే ఇండస్ట్రీలోకి వచ్చారు పృథ్వీ. 'గండిపేట రహస్యం'లో చేసిన కీలక పాత్రలు కాకుండా చిన్న చిన్న వేషాలు వేశారు. 1990లో తల్లి మరణంతో సొంతూరు తాడేపల్లిగూడెంకు వెళ్లిపోయారు. 1992లో తిరిగి హైదరాబాద్ వచ్చారు. అయితే సినిమాల్లోకి వెళ్లకుండా నల్లకుంటలో సిటీ కేబుల్‌లో ప్రోగ్రామ్ ఎడిటర్‌గా జాయినయ్యారు. అప్పుడు సినిమా ఆఫీసులన్నీ చెన్నైలోనే ఉండేవి. హైదరాబాద్‌కు ఎవరైనా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వస్తే వాళ్ల ఇంటర్వ్యూలు చేసి, దగ్గరవడానికి ప్రయత్నించారు. అలా ఈవీవీ సత్యనారాయణ సినిమాలు 'ఆ ఒక్కటీ అడక్కు', 'వారసుడు' సినిమాల్లో నటించారు. ఆ తర్వాత నల్లకుంట నుంచి కృష్ణానగర్‌కు వచ్చేశారు.