హీరో గోపీచంద్ తండ్రి టి. కృష్ణ డైరెక్టర్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. విశేషమేమంటే ఆయన డైరెక్ట్ చేసింది ఆరంటే ఆరు సినిమాలు. 'నేటి భారతం' (1983) మొదటి సినిమా అయితే చనిపోయే ముందు తీసిన 'రేపటి పౌరులు' (1986) చివరి సినిమా. ఆయన తీసినవన్నీ అభ్యుదయ సామాజిక చిత్రాలే. ఒక్క 'ప్రతిఘటన' చిత్రం చాలు డైరెక్టర్‌గా ఆయన ప్రతిభ ఎలాంటిదో చెప్పడానికి. 'దేశంలో దొంగలు పడ్డారు', 'దేవాలయం', 'వందేమాతరం' చిత్రాలు కూడా ఆయనకు గొప్ప పేరు తెచ్చాయి.
టి. కృష్ణ కేన్సర్‌తో మరణించగా, ఆయన పెద్దకొడుకు ప్రేమ్‌చంద్ తండ్రి బాటలో డైరెక్షన్‌లో అడుగుపెట్టి, తొలి సినిమాని డైరెక్ట్ చేసే కాలంలో దురదృష్టవశాత్తూ యాక్సిడెంట్‌కు గురై అర్ధంతరంగా తనువు చాలించాడు. రెండో కొడుకు గోపీచంద్ మాత్రం నటనను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 'తొలివలపు'తో హీరోగా పరిచయమై, అది డిజాస్టర్ కావడంతో, తేజ డైరెక్ట్ చేసిన 'జయం' సినిమాలో విలన్‌గా నటించి, అద్భుతంగా రాణించాడు. 'వర్షం', 'నిజం' సినిమాల్లో క్రూరమైన విలన్‌గా మెప్పించిన అతడిని తండ్రి స్నేహితుడైన నిర్మాత పోకూరి రామారావు 'యజ్ఞం', 'రణం' సినిమాల ద్వారా హీరోగా ఇమేజ్ కల్పించారు. అయితే ఇప్పుడు గోపీ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్న విషయం కాదనలేని నిజం.
ఇంత దాకా తండ్రి డైరెక్ట్ చేసిన జానర్ సినిమా ఒక్కటి కూడా గోపీ చెయ్యలేదు. ఆ విషయం అతడికి బాగా తెలుసు. అయితే ఆ తరహాలో ఒక్క సినిమా అయినా చెయ్యాలనే కోరిక మాత్రం అతడిలో బలంగా ఉంది. "నాన్న చేసిన తరహా చిత్రాలు ఒక్కటీ నేను చేయలేదు. ఆయన సినిమాలను రీచ్ అవ్వడం అంత సులభం కాదు. ఆ తరహా కథ, ఇంటెన్స్‌తో తీసే డైరెక్టర్ కుదిరితే చెయ్యడానికి రెడీగా ఉన్నా. ఇప్పటివరకూ నాన్న చేసిన దాన్లో 10 శాతం కూడా నేను చెయ్యలేదు" అని ఒప్పుకున్నాడు గోపీచంద్. అతడి కోరికను తీర్చే డైరెక్టర్ ఎప్పటికైనా వస్తాడో, రాడో...