వరుసగా 'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో వచ్చిన సక్సెస్‌తో వరుసగా ఆరు ఫ్లాపుల చేదు అనుభవం నుంచి పూర్తిగా బయటకొచ్చేశాడు సాయిధరమ్ తేజ్. జీవితంలో ఎదురుదెబ్బలు తింటూ సక్సెస్ కోసం చకోరపక్షిలా ఎదురుచూసే విజయ్‌కృష్ణ అనే పాత్రతో 'చిత్రలహరి'తో ఆకట్టుకున్న అతను, తన నిజ జీవిత పేరుతోనే చేసిన పాత్రతో 'ప్రతిరోజూ పండగే'లో మరింతగా అలరించాడు. కొద్ది రోజుల్లో తాతయ్య చనిపోతాడని తెలిసి, ఆయనకు చివరి దశలో ఆనందకర క్షణాల్ని అందించాలని తపించే మనవడిగా బాగా రాణించాడు.
ఇప్పడు 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సాయి. సుబ్బు అనే డెబ్యూ డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమాతో అతను హ్యాట్రిక్ పూర్తి చేయడం ఖాయమని యూనిట్ మెంబర్స్ ఘంటాపథంగా చెబుతున్నారు. ఆ సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందా, లేక ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజవుతుందా.. అనేది రానున్న రోజులు డిసైడ్ చేయనున్నాయి.
'సోలో బ్రతుకే సో బెటర్' తర్వాత దేవా కట్టా డైరెక్షన్‌లో నటించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు సాయి. ఇందులో అతను యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను పోషించనున్నాడు. దీని కోసం ఇప్పటికే అతను సర్వీసుల్లో కొత్తగా చేరిన కొంతమంది యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లను మీట్ అయ్యాడనీ, వాళ్ల బాడీ లాంగ్వేజ్, వాళ్ల ప్రవర్తనను అబ్జర్వ్ చేశాడనీ సమాచారం. క్యారెక్టర్‌లో ఇమిడిపోవడానికి ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుందని అతను భావిస్తున్నాడు. ఈ సినిమా కథ నార్త్ ఇండియాలో మొదలై హైదరాబాద్‌కు చేరుకుంటుందని వినికిడి. ఈ మూవీతో సరికొత్త సాయి కనిపిస్తాడని అతని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.