![]() |
![]() |

ఒకనాడు తెలుగులో హీరోగా ఫ్యామిలీ హీరోగా, మరి కొన్ని మాస్ చిత్రాలలో కూడా హీరో పాత్రలను పోషించి మెప్పించిన జగపతిబాబు 'లెజెండ్'తో విలన్‌గా మారిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రను చేసిన జగపతిబాబుకు విలన్ గా స్టార్‌డం వచ్చింది. ఆయన విలనిజానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆయనకు తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా మొదలయింది.
విలన్ గానే కాదు... తండ్రి పాత్రలతో పాటు పలు వైవిధ్యభరితమైన పాత్రలు ఆయన్ను వెత్తుకుంటూ వచ్చాయి. ఇతర భాషల్లో కూడా వేషాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి జగపతిబాబు మాట్లాడుతూ తనకు హీరో పాత్రలు చేసినప్పటి కంటే ఇమేజ్ పరంగా, ఆదాయం పరంగా విలన్ గా మారిన తర్వాతనే బాగుందని చెప్పుకొచ్చారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో విలన్ పాత్రకు జగపతిబాబుని తీసుకున్నారు.
ఇందులో తారక్ పాత్రకు దీటుగా జగపతిబాబు పాత్ర సాగుతుంది. బసిరెడ్డి పాత్రలో జగపతిబాబు అదరగొట్టారు. ప్రతినాయకుడు అంటే ఇలా ఉండాలి.. హీరోలకు ఛాలెంజ్ విసిరే విలన్‌లు ఉంటే ఆ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది ఈ చిత్రంతో నిరూపితమయింది. కాగా ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మహేష్ బాబు హీరోగా యస్‌యస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ తాజాగా సారథి స్టూడియోలో ప్రారంభమైంది. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో పలు యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. కాగా 'అరవింద సమేత వీరరాఘవ'లో బసిరెడ్డిగా తనదైన విలనిజాన్ని వేరే లెవల్లో ప్రజెంట్ చేశారు జగపతిబాబు.
త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరోసారి జగ్గు భాయ్ పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నాడంటే ఇందులోని విలన్ పాత్రపై మంచి నమ్మకాలు ఏర్పడుతున్నాయి. తాజా చిత్రంలో జగపతిబాబు పాత్ర బసిరెడ్డిని మించిన విధంగా ఉండేలా త్రివిక్రమ్ ఈ పాత్రను డిజైన్ చేశారట. మొత్తానికి ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోయిజానికి జగపతిబాబు బసిరెడ్డి పాత్ర చాలెంజ్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రంలో తండ్రి కొడుకులుగా మహేష్- జగపతిబాబు మెప్పించిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |