![]() |
![]() |

దిల్ రాజు కెరీర్ నిర్మాతగా నాలుగైదేళ్లుగా ఇబ్బందులు పడుతూనే సాగుతోంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ ల బంద్ నుంచి థియేటర్ల కేటాయింపు వరకు అజిత్- విజయల ఫ్యాన్స్ మధ్య వైరం వరకు ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ముఖ్యంగా ఆయనకు నైజాం, ఉత్తరాంధ్రలలో డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే లాభాలు చాలా అధికం. అలా పలు ధియేటర్లు ఆయన చేతిలో ఉండడంతో పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. కానీ ఈ పెత్తనం ఎంతో కాలం సాగదు కదా... తాడిని తన్నేవాడు ఉంటే వాడిని తలదన్నేవాడు వస్తాడనే సామెత ఎలాగూ ఉంది.
ఇప్పుడు దిల్ రాజుకు మైత్రి మూవీస్ తో వైరం అనేది చాలా ఇబ్బందుల్లోకి నెట్టింది. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రాలు మామూలుగా అయితే నైజాం, ఉత్తరాంధ్రలలో దిల్ రాజుకి డిస్ట్రిబ్యూషన్ లభించి ఉండేది. కానీ మైత్రి వారితో వైరం వలన ఆయన నిరంకుశమైన వైఖరి వల్ల విసిగిపోయిన మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతగా నైజాం, ఉత్తరాంధ్రలలో సొంతగా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు. అందులోనూ ఏకంగా చిరు బాలయ్యల విషయంలో థియేటర్ల విషయంలో దిల్ రాజు నాటకాలు ఆడటం, ఆయన ధోరణి నచ్చక వారు ఈ చిత్రాలను నైజాం, ఉత్తరాంధ్రలలో సొంతగా పంపిణీ చేసుకున్నారు. ఇది దిల్ రాజు కు చాలా చేటు చేసింది.
అయితే ఇప్పటి వరకు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల విషయంలో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా ముందుందని సమాచారం. దిల్ రాజు పోకడలతో విసిగిపోయిన మిగిలిన నిర్మాతలు కూడా అలెర్ట్ అవుతున్నారు. ఆయన ఆదిపత్యం ఇకపై కొనసాగడానికి వీలులేదని లేకపోతే ఆయన తమకి ఎసరు పెడతాడని వారు భావిస్తున్నారు. అలా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిల చిత్రాలను పంపిణీ చేసే అవకాశం దిల్ రాజు ఇప్పటికే చేజార్చుకున్నారు. తాజాగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఎస్ ఎస్ ఎం బి 28 నిర్మాత అయిన చినబాబు కూడా తమ చిత్రాన్ని దిల్ రాజుకు ఇవ్వకూడదని భావించాడని సమాచారం. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి చినబాబు అలియాస్ ఎస్ రాధాకృష్ణ నిర్మాత.
ఆయన ఈసారి దిల్ రాజును కాదని నైజాం థియేటికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ నైజాం డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ ఫిలిమ్స్ వారికి భారీ మొత్తానికి అమ్ముకున్నారట. గత కొంతకాలంగా మహేష్ సినిమాలన్నీ నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం మాత్రం ఏషియన్ ఫిలిమ్స్ కి వెళ్లిపోయింది. ఇది దిల్ రాజుకు పెద్ద షాకే అంటున్నారు. మహేష్ బాబు చిత్రంపై ఆ మధ్య అవాక్కులు చవాక్కు లు పేలడం దిల్ రాజుకి తగిన శాస్తే జరిగిందని అంటున్నారు. రాబోయే కాలంలో నైజాంలో మైత్రి వారితో పాటు ఏషియన్ ఫిలిమ్స్ వారు కూడా దిల్ రాజుకు భారీ పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి చెడపకురా చెడేవు అన్నట్టు దిల్ రాజు తన పనుల ద్వారా మాటల తీరు ద్వారా తన గోతిని తానే తవ్వుకున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |