సినిమాల్లో తారగా అవకాశం రావాలంటే 'టాలెంట్' అవసరమని ఎవరైనా అనుకుంటారు. దానికి ఒకింత 'లక్' కూడా కావాలంటారు. కానీ అవి మాత్రమే సరిపోవు. ఇంకోటి కూడా కావాలి. అదే 'క్యాస్టింగ్ కౌచ్'కు సరేననడం! ఈ మాట హాలీవుడ్ నుంచి వచ్చింది. అక్కడ జనరల్‌గా ఒక అప్‌కమింగ్ యాక్ట్రెస్‌కు సినీ ఛాన్స్ రావాలంటే.. క్యాస్టింగ్ డైరెక్టర్‌కో, ప్రొడ్యూసర్‌కో దేహాన్ని అప్పగించాల్సిందే. దాని కోసం ఏర్పాటుచేసిన పడక మంచాన్నే క్యాస్టింగ్ కౌచ్ అంటారన్న మాట!!
సరిగ్గా అదే మాట ప్రచారంలో లేకపోయినా, అదే తరహా స్థితి మనదేశంలోని చిత్రసీమల్లోనూ చాలా కాలం నుంచే ఉంది. ఆ విషయం మనకు జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత, ప్రఖ్యాత దివంగత రచయిత రావూరి భరద్వాజ రచించిన సుప్రసిద్ధ నవల 'పాకుడురాళ్లు'లో స్పష్టంగా కనిపిస్తుంది. అందులో నవలా నాయికకు సినీ తారగా అవకాశాలు ఇచ్చే క్రమంలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎలా ఆమె దేహంతో ఆడుకున్నారో, తన దేహాన్నే పెట్టుబడిగా ఆమె ఎలా టాప్ హీరోయిన్గా ఎదిగిందో.. కళ్లకు కట్టినట్లు రాశారు భరద్వాజ. ఈ నవలను ఆయన 1960లలోనే రాయడం గమనార్హం.
'పాకుడురాళ్లు'కు అప్పట్లో తెలుగు చిత్రసీమలోని ఒక ప్రముఖ తార జీవితమే ప్రేరణ అనే వ్యాఖ్యలు గట్టిగా వినిపించాయి. దాన్ని బట్టి చిత్రసీమలో ఔత్సాహిక తారలపై లైంగిక దోపిడీ అనేది తొలినాళ్ల నుంచే కొనసాగుతూ వస్తోందనే విషయంలో అనుమానం లేదు.