మెగాస్టార్ మెచ్చుకోలు మాట తనకు ఆస్కార్ అవార్డ్ వచ్చినంత సంతోషాన్ని ఇచ్చిందని రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీధర్ సీపాన అంటున్నారు. చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా సినిమా చేసే అవకాశం అతడికి వచ్చింది. 'ఆచార్య' స్క్రిప్ట్ పనుల్లో భాగం కావడం నుండి కళ్యాణ్ దేవ్ సినిమా కథ చిరంజీవిగారికి చెప్పడం వంటివి ఈ ఏడాది తన జీవితంలో జరిగాయనీ, ఎప్పటికీ మరువలేని క్షణాలు ఉన్నాయనీ శ్రీధర్ సీపాన తెలిపారు.
"చిరంజీవిగారి 'ఆచార్య' స్క్రిప్ట్ పనుల్లో భాగం కావడం వల్ల కొరటాల శివగారితో, మెగాస్టార్‌తో మంచి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కొరటాలగారు నా కథ విని ప్రోత్సహించారు. కథ చెప్పడానికి చిరంజీవిగారి దగ్గరకి నన్ను కళ్యాణ్ దేవ్ తీసుకువెళ్లారు. కథ విన్న తరవాత 'ఇంతసేపు కథ వింటున్నప్పుడు మధ్యలో రెప్పలు వాలతాయి. నేను రెప్ప వేయకుండా నీ స్క్రిప్ట్ ఆద్యంతం విన్నాను' అని చిరంజీవిగారు చెప్పారు. ఆ మాట ఆస్కార్ అవార్డు వచ్చినంత సంతోషాన్ని ఇచ్చింది" అని శ్రీధర్ సీపాన చెప్పారు.
సూపర్‌హిట్ సినిమా 'లౌక్యం'తో శ్రీధర్ సీపాన మాటల రచయితగా భారీ కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేశాడు. అతడి ఖాతాలో 'అహనా పెళ్ళంట', 'పూల రంగడు' వంటి విజయాలు ఉన్నాయి. ఇప్పుడీ యువ రచయిత కళ్యాణ్ దేవ్ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఆల్రెడీ అతడు దర్శకత్వం వహించిన 'బృందావనమది అందరిదీ' సినిమా కళ్యాణ్ దేవ్ సినిమా విడుదలైన తరవాత ఓటీటీలో విడుదల అవుతుందట.