సౌత్ ఇండియాలో క్యారెక్టర్‌లో ఇమిడిపోయే యాక్టర్లలో తమిళ స్టార్ విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డ్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ వంటివి ఆయన ఖాతాలో ఉన్నాయి. పాత్ర ఎలా కావాలంటే అలా తన బాడీని మార్చుకోవడంలో విక్రమ్ ప్రదర్శించే డెడికేషన్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. చాలామంది ఇప్పటికీ శంకర్ సినిమా 'ఐ'లో ఆయన బక్కగా కనిపించిన తీరు చూసి నోళ్లు వెళ్లబెట్టారు. కెమెరా ట్రిక్‌తోనో, వీఎఫ్ఎక్స్‌తోనో ఆయనను అలా చూపించారని అనుకొనేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఆయన రియల్‌గానే అలా మారిపోయారు. ఆ సినిమా కోసం నాలుగేళ్ల సుదీర్ఘ కాలం పాటు తన శరీరాన్ని ఆయన కష్టపెట్టుకున్న తీరు ఒళ్లు జలదరింపజేస్తుంది.
'ఐ' సినిమా మొత్తం ఆయన నాలుగు రకాల బాడీ షేప్‌తో కనిపిస్తారు. ఒకటి.. బాడీబిల్డర్, రెండు.. మృగం, మూడు.. సాధారణ వ్యక్తి, నాలుగు.. గూని వ్యక్తి. ఈ సినిమా కోసం మొదట ఆయన బాడీ బిల్డింగ్ చేసి, కండలు పెంచి దృఢంగా తయారయ్యాడు. ఆ తర్వాత ఆహారాన్ని బాగా తగ్గించేసి, సన్నగా మారిపోయాడు. రోజుకు ఆయన పది విడతలుగా చిన్న చిన్న మొత్తాల్లో డైట్ తీసుకుంటూ వచ్చాడు. ఎంత చిన్న మొత్తమంటే.. ఒకసారి ఒక ఎగ్ వైట్ మాత్రమే ఉంటే, ఇంకోసారి సగం యాపిల్, మరోసారి ఒక సాల్మన్ చేప ముక్క, ఆపైన కొంచెం వెజిటబుల్.. ఇలాంటి డైట్‌తో ఆయన రివటలా మారిపోయాడు. రోజుకు 300 గ్రాముల బరువును ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. రోజుకు మూడుసార్లు వర్కవుట్లు చేసేవాడు. తినే తిండి కంటే ఎక్కువగా కేలరీలను కరిగించుకుంటూ వచ్చాడు. రోజూ ఉదయం, సాయంత్రం 15 కిలోమీటర్లు సైక్లింగ్ కూడా చేసేవాడు. అందువల్లే ఆయన అంత లీన్‌గా ఆ సినిమాలో కనిపించాడు. పాత్ర కోసం ఆ రకంగా శరీరాన్ని హింస పెట్టుకొనేవాళ్లు అరుదనే చెప్పాలి.