![]() |
![]() |

టిల్లు వేణుగా, జబర్దస్త్ వేణుగా వెండితెరపైనా బుల్లితెరపైనా నవ్వించి కమెడియన్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి.. 'బలగం' సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే అందరినీ కట్టిపడేశాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన ఈ సినిమాకి థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వేణు ప్రతిభకి ఫిదా అయిన దిల్ రాజు.. దర్శకుడిగా ఆయన రెండో సినిమాని కూడా తమ బ్యానర్ లోనే భారీస్థాయిలో చేస్తామని చెప్పాడు. అయితే వేణు రెండో సినిమా ఎవరితోనో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణతో అని తెలుస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108 వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దసరాకు విడుదల కానుంది. దీని తర్వాత బాలయ్య చేయబోయే సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 10 న ఒకేసారి రెండు సినిమాల ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు. అందులో ఒకటి బోయపాటి శ్రీను మూవీ కాగా, మరొకటి వేణుతో అని తెలుస్తోంది. దిల్ రాజు పలువురి స్టార్లతో వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో బాలయ్య సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాకి ఊహించని విధంగా వేణు దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. అదే నిజమైతే బాలయ్యతో వేణు ఎలాంటి సినిమా తీస్తాడోనన్న ఆసక్తి నెలకొంది.
![]() |
![]() |