విజయ్ సేతుపతి పేరుతో కనిపిస్తున్న పోస్టర్లు తమిళనాడులో వైరల్ అవుతున్నాయి. అందులోనూ అపాయం... ఇది తమిళనాడా? లేకుంటే నార్త్ ఇండియానా? మేలుకో తమిళోడా... అంటూ విజయ్ సేతుపతి ఫొటోతో కనిపిస్తున్న పోస్టర్ల మీద గట్టి చర్చే జరుగుతోంది. తమిళ సినిమా రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి, తనకంటూ ప్రత్యేకత తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి.
కోలీవుడ్‌లోనే కాకుండా, తెలుగు, హిందీలోనూ నటిస్తున్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరో వైపు విలన్ కేరక్టర్లు కూడా చేస్తున్నారు. హీరోగా నటించిన పాత్రలు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టాయో, విలన్ వేషాలు కూడా అంతే పేరు తెచ్చిపెట్టాయి విజయ్ సేతుపతికి. ఇప్పుడు హిందీలో షారుఖ్‌ఖాన్‌కి విలన్‌గా నటిస్తున్నారు విజయ్ సేతుపతి. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేస్తున్న జవాన్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు విజయ్ సేతుపతి. కత్రినా నాయికగా నటిస్తున్న మెరీ క్రిస్ మస్లోనూ విజయ్ సేతుపతి రోల్ స్పెషల్‌గా మెన్షన్ చేయదగ్గదే. ది ఫ్యామిలీ మేన్ సీరీస్‌ని డైరక్ట్ చేసిన రాజ్, డీకే దర్శకత్వంలో ఓ వెబ్సీరీస్లోనూ నటిస్తున్నారు విజయ్ సేతుపతి.
చేతినిండా బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ఎందుకు నార్త్ ఇండియన్స్ ని బాయ్‌కాట్ చేయమంటారు? అసలు నార్త్ ఇండియన్స్ తో సేతుపతికి ఎలాంటి సమస్యా లేదు కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అయినా మేలుకో తమిళోడా... అంటూ కనిపిస్తున్న పోస్టర్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. వివాదాలకు దూరంగా ఉండే విజయ్ సేతుపతి, ఇప్పుడు దీని గురించి ఏమంటారో వినాలని చాలా మంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.