![]() |
![]() |

బావమరిది అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి చిత్రం చేసి చాలా కాలమే అవుతుంది. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ ఓ చిత్రం నిర్మించాలనుకొంది. చిరంజీవి 150వ చిత్రాన్ని కూడా అల్లు అరవింద్ నిర్మించాలని భావించారు. కానీ తండ్రి చిరంజీవి చిత్రాల కోసం రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌ను ఏర్పాటు చేసి, దాని కింద సినిమాలు తీస్తున్నారు. ఈ బ్యానర్‌ను స్వయంగా రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు. ఇది మెగాస్టార్ సినిమాల కోసం ప్రారంభించిన బ్యానర్ అని కూడా ఆయన చెప్పారు.
అయితే 'ఖైదీ నెంబర్ 150' తర్వాత చిరంజీవి హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని అల్లు అరవింద్ భావించారు. అల్లు అర్జున్ 'సరైనోడు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందించిన ఊపులో బోయపాటికి ఓ ఛాన్స్ ఇస్తానని చిరు కూడా మాట ఇచ్చారు. కానీ గీతా ఆర్ట్స్‌కు సంబంధించి బోయపాటి ఏమయ్యాడో, ఆయన కథలు ఏమయ్యాయో తెలీదు.
చిరంజీవి రాబోయే చిత్రాలన్నీ పెద్ద పెద్ద బ్యానర్లో రూపొందుతున్నాయి. వీటన్నింటిని కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ సమర్పణలోని చేస్తున్నారు. తాజాగా మైత్రి మూవీస్ బ్యానర్ లో మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' చేశారు. తదుపరి 14 రీల్స్ సంస్థతో 'భోళాశంకర్' చేస్తున్నారు. ఆ తర్వాత యూవీ క్రియేషన్స్, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లకు కమిట్ అయ్యారు. త్వరలో తన పెద్ద కుమార్తె సుస్మిత కోసం చిత్రం చేస్తాను అన్నారు. ఇన్ని బ్యానర్ల పేర్లలో గీత పేరు మాత్రం వినిపించడం లేదు.
'సైరా', 'ఆచార్య', 'గాడ్ ఫాదర్' కూడా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలోనే చేశారు. చిరు కనీసం భాగస్వామ్యంలోనైనా గీతా ఆర్ట్స్ ను కలుపుకోలేదు. తన కెరీర్ లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన గీత ఆర్ట్స్ కు చిరు చిత్రం చేయడం లేదంటే అందులో మతలబు ఏదో ఉండే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. చిరు కేవలం గీత ఆర్ట్స్ కి మాత్రమే కాదు, తనతో గతంలో వరుస చిత్రాలు నిర్మించిన వైజయంతి మూవీస్, క్రియేటివ్ కమర్షియల్స్ వంటి చాలా సంస్థలకు చిత్రాలు చేయడం లేదు. మరి ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి తనదైన క్లారిటీని ఎప్పుడు ఇస్తాడు అనేది వేచి చూడాలి.
![]() |
![]() |