![]() |
![]() |

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే వాటిపై ఎంతో భారీ అంచనాలు ఉండేవి. భారతీయ చిత్రాలంటే బాలీవుడ్ చిత్రాలే అనే భావన ప్రేక్షకుల్లో ఉండేది. భారీ బడ్జెట్ తో చిత్రాలు నిర్మించాలన్నా, వరల్డ్ వైడ్ గా సినిమాలను విడుదల చేయాలన్నా అది బాలీవుడ్ సినిమాలకు మాత్రమే సాధ్యమని భావించేవారు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సౌతిండియన్ చిత్రాలలో తళుక్కున మెరవాలన్నా సరే భారీ కోరికలు కోరే వారు. తామేదో సౌతిండియన్ చిత్రాలలో నటిస్తూ వారికి సహాయం చేస్తున్నామనే భావనలో ఉండేవారు. బాలీవుడ్ స్టార్ ఇమేజి క్రేజ్ మన దేశం దాటి విదేశాలకు దాటిపోయేవి. వారు తీసుకునే రెమ్యూనరేషన్ ను కూడా మన వాళ్ళు నోరెళ్ల పెట్టుకుని చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత నిజమయింది.
రాజమౌళి ఏ హీరోతో సినిమా తీస్తే ఆ హీరోకు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ వస్తోంది. దాంతో దేశంలోని బడాబడా నిర్మాతలు కూడా మన స్టార్ హీరోల చుట్టూ పదుల సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తున్నారు. 'డేట్స్ లేవు బాబు' అంటే 'మీకు నచ్చిన డేట్ ఇవ్వండి. రెండు మూడు ఏళ్ల తర్వాత అయినా సరే మేము వేచి ఉంటాం' అని సమాధానం చెబుతున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్, 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. రేపు మహేష్ బాబు- రాజమౌళిల చిత్రం విడుదలయితే మహేష్ చుట్టూ కూడా నిర్మాతలు గుంపులు కట్టడం ఖాయం. అందుకే కొందరు ముందు జాగ్రత్తగా మహేష్ కు ఇప్పటినుంచే అడ్వాన్సులిచ్చి ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన రాజమౌళితో చిత్రం చేస్తే ఇక తమకు అందుబాటులో ఉండడని వారి అభిప్రాయంగా తెలుస్తోంది. మొత్తానికి ఒకప్పుడు తమ చుట్టూ ఇతర హీరోలను, దర్శకులను, నిర్మాతలను తిప్పుకున్న బాలీవుడ్ వారి చేత దక్షిణాదిలో ప్రదక్షిణలు చేయిస్తున్న ఘనత రాజమౌళికే దక్కుతుంది అని చెప్పాలి.
![]() |
![]() |