తెలుగునాట సంచలనం సృష్టించిన తమిళ అనువాద చిత్రాల్లో 'రంగం' (2011) ఒకటి. ఇటీవల కొవిడ్ 19 బారిన పడి స్వర్గస్థులైన వెర్సటైల్ డైరెక్టర్ కేవీ ఆనంద్ రూపొందించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. తమిళ వెర్షన్ ('కో' అనేది టైటిల్) విడుదలైన మూడు వారాల తరువాత ఇక్కడ అనువాదమై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా పొందింది.
స్టార్ కంపోజర్ హేరిస్ జైరాజ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. మరీ ముఖ్యంగా.. "ఎందుకో ఏమో", "ఈ మంచుల్లో ప్రేమంచుల్లో", "నెమలి కులుకుల" వంటి గీతాలు అప్పట్లో యువతరాన్ని ఫిదా చేశాయి. జీవా, కార్తిక, పియా బాజ్ పాయ్, అజ్మల్ ఆమిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్, అచ్యుత్ కుమార్, సోనా కీలక పాత్రల్లో దర్శనమిచ్చారు.
సూర్య, కార్తి, జయం రవి, అబ్బాస్, అధర్వ, భరత్, తమన్నా, అంజలి, హేరిస్ జైరాజ్, పీటర్ హెయిన్ తదితర సినీ ప్రముఖులు ఓ పాటలో తళుక్కన మెరిశారు. తమిళ వెర్షన్ 'కో'కి రెండు 'ఫిల్మ్ ఫేర్' అవార్డులు, నాలుగు 'తమిళనాడు స్టేట్ అవార్డ్స్'తో పాటు పలు పురస్కారాలు దక్కాయి. 2011 మే 13న తెలుగువారి ముందుకొచ్చిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 'రంగం'.. నేటితో 10 వసంతాలను పూర్తిచేసుకుంది.