తమిళ స్టార్ హీరో సూర్య బుధవారం తన తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్, తమ్ముడు కార్తీతో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళం అందించారు. ఇటీవల, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్‌కు సాధ్యమైనంత అందించాల్సిందిగా ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
బుధవారం స్టాలిన్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో తండ్రి, తమ్ముడితో పాటు కలిశారు సూర్య. అనంతరం మీడియాతో శివకుమార్ మాట్లాడుతూ, "కొవిడ్-19 నుంచి ప్రజలను కాపాడ్డం అనేది తక్షణ కర్తవ్యం. మావైపు నుంచి ఓ చిన్న మొత్తాన్ని విరాళంగా అందించాం. వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకువచ్చి తమ వంతు సాయం చేయాలి." అని చెప్పారు.
స్టాలిన్‌తో మీటింగ్ విషయమై మాట్లాడుతూ, "స్టాలిన్ తండ్రి (ఎం. కరుణానిధి)ని 30 నుంచి 40 సంవత్సరాల పాటు నేను కలిశాను. ఆయన రాజకీయ వారసుడ్ని తొలిసారి కలవడం సంతోషంగా ఉంది. తమిళనాడులో తమిళం మాట్లాడే, చదివే యువతకు ఉద్యోగావకాశాలు లభించాలని నేను కోరుకుంటున్నా. మొదట ఆ పని జరగాలి." అని అన్నారు శివకుమార్.