సూపర్‌స్టార్ కృష్ణ, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇద్దరూ సినీ రంగంలో ఆదుర్తి సుబ్బారావు స్కూల్ నుంచి వచ్చి తమ తమ రంగాల్లో అగ్రస్థాయికి ఎదిగారు. సౌండ్ రికార్డిస్ట్‌గా ఉన్న కె. విశ్వనాథ్.. అప్పటికి అగ్ర దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్న ఆదుర్తి దగ్గర దర్శకత్వ శాఖలో అడుగుపెట్టి, అనంతరం అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 'ఆత్మగౌరవం' (1966) చిత్రంతో దర్శకుడయ్యారు. 'శంకరాభరణం' చిత్రంతో దర్శకుడిగా ఆయన ఎంతటి చరిత్ర సృష్టించిందీ అందరికీ తెలిసిందే.
అంతవరకూ సినిమాలలో ప్రయత్నాలు చేస్తూ, అడపాదడపా చిన్న చిన్న పాత్రలు ధరిస్తున్న కృష్ణ.. ఆదుర్తి కళ్లల్లో పడి 'తేనెమనసులు' (1965) చిత్రంతో హీరోగా పరిచయమై, తర్వాత కాలంలో అగ్రహీరోగా ఎదిగారు. ఇండస్ట్రీలో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన ఇంట్లో ఇప్పటికీ ఆదుర్తి సుబ్బారావు చిత్రపటం గోడమీద కనిపిస్తూ ఉంటుంది.
అలా కృష్ణ, కె. విశ్వనాథ్ ఇద్దరూ ఒకే గురువు దగ్గర్నుంచి వచ్చి, కలిసి మూడు చిత్రాలు చేశారు. అవి.. 'ప్రైవేట్ మాస్టార్' (1967), 'ఉండమ్మా బొట్టు పెడతా' (1968), 'నేరము-శిక్ష' (1973). వీటిలో 'ప్రైవేట్ మాస్టార్' సినిమాలో కృష్ణ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారు. మిగతా రెండు సినిమాలూ ఇటు ప్రేక్షకాదరణనూ, అటు విమర్శకుల ప్రశంసలనూ పొందాయి. అయితే ఆ తర్వాత కాలంలో వారి కాంబినేషన్‌లో సినిమా రాకపోవడం వారి అభిమానులను ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
చాలా కాలం క్రితం ఒకసారి ఆ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ప్రకటన వచ్చింది. "తగిన కథ కోసం చూస్తున్నాం' అని విశ్వనాథ్ కూడా చెప్పారు. కానీ తర్వాత ఏ కారణం చేతనో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆ ఇద్దరూ దాదాపుగా సినిమాల నుంచి రిటైర్ అయ్యారు. విజయనిర్మల మరణానంతరం కృష్ణ పూర్తిగా తన నివాసానికే పరిమితమయ్యారు. మరోవైపు వయోభారంతో విశ్వనాథ్ కూడా పదేళ్ల నుంచీ మెగాఫోన్ చేపట్టలేదు. ఏదేమైనా కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన ఆదుర్తి స్కూల్ నుంచి వచ్చిన కృష్ణ.. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటే, విశ్వనాథ్.. కళాత్మక చిత్రాల దర్శకుడిగా దేశవ్యాప్తంగా కీర్తి పొందడం విశేషంగా అనిపిస్తుంది.