వినోదభరిత చిత్రాలకు చిరునామాగా నిలిచిన కథానాయకుల్లో అల్లరి నరేశ్ ఒకరు. ఒకదశలో వరుస విజయాలతో అలరించిన వైనం అల్లరి నరేశ్ సొంతం. అలా.. నరేశ్ నుంచి వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో 'సీమ టపాకాయ్' (2011) ఒకటి. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామాలో అల్లరి నరేశ్ కి జంటగా పూర్ణ దర్శనమివ్వగా.. సాయాజీ షిండే, సుధ, ఎల్బీ శ్రీరామ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు, జయప్రకాశ్ రెడ్డి, రావు రమేశ్, వెన్నెల కిశోర్, రవిప్రకాశ్, తిరుపతి ప్రకాశ్, సురేఖా వాణి, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ఒక కోటీశ్వరుని కొడుకైన శ్రీకృష్ణ (అల్లరి నరేశ్), ధనవంతులంటే అసహ్యించుకొనే సత్య (పూర్ణ) అనే అమ్మాయి ప్రేమలోపడి, ఆమె ప్రేమను ఎలా పొందాడనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందించిన ఈ చిత్రానికి అడుసుమిల్లి విజయ్ కుమార్ ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటల్లో "ఆకాశంలో ఒక తార" ('సింహాసనం'లో సూపర్ స్టార్ కృష్ణ, అందాల తార జయప్రదపై చిత్రీకరించిన గీతం) రీమిక్స్ విశేషంగా ఆకట్టుకుంది.
హిందీలో 'అజబ్ గజబ్ లవ్' పేరుతో ఈ సినిమా రీమేక్ కాగా.. జాకీ భగ్నాని, నిధి సుబ్బయ్య జంటగా నటించారు. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ విజయ ప్రసాద్ మళ్ళా నిర్మించిన 'సీమ టపాకాయ్'.. 2011 మే 13న విడుదలైంది. నేటితో ఈ కామెడీ ఎంటర్టైనర్.. 10 వసంతాలను పూర్తిచేసుకుంది.