జూనియర్ ఎన్టీఆర్ టెస్ట్‌లో కొవిడ్ 19గా నిర్ధారణ అయ్యి, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో విశ్రాంతి తీసుకుంటూ, డాక్టర్ల సూచనల ప్రకారం మందులు వాడుతూ వస్తున్నారు. రామ్‌చరణ్‌తో కలిసి ఆయన హీరోగా నటిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కూడా ప్రస్తుతం జరగడం లేదు. కారణం తారక్‌తో పాటు మరికొంత మంది కూడా కొవిడ్‌తో బాధపడుతుండటం. కొవిడ్ సోకక ముందు ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థల్లో ఒకటైన డెడ్‌లైన్‌తో ఆయన సంభాషించారు. ఆ సందర్భంగా పాండమిక్ టైమ్ ఎలా అనిపిస్తోందనే ప్రశ్న ఎదురైంది తారక్‌కు.
"మహమ్మారి చాలా ఫ్రస్ట్రేషన్ కలిగిస్తోంది. నా ఫస్ట్ మూవీ (నిన్ను చూడాలని)లో నటించేటప్పుడు నా వయసు పదిహేడేళ్లు. అప్పట్నుంచీ కూడా ఏడాది 365 పనిచేయడానికి ఇష్టపడేవాళ్లలో నేనొకడ్ని. అలాంటి వర్కాహాలిక్నైన నాకు మహమ్మారి వల్ల ఇంట్లో బంధించినట్లు అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని నేనెప్పుడూ కోరుకోను." అని ఆయన చెప్పాడు.
అయితే, దీనివల్ల ఓ ఉపయోగం జరిగిందనేది తారక్ అభిప్రాయం. "నా అందమైన ఇద్దరు చిన్నారి కొడుకులతో గడిపే, వారితో కనెక్ట్ అయ్యే టైమ్ దొరికింది. అలాగే మా అమ్మతో, భార్యతో, నా కజిన్స్‌తో టైమ్ గడపగలుగుతున్నా. ఇలా మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నాను. మనం ఎప్పుడైతే పనిలోకి తిరిగి వెళ్తామో, అప్పుడు తిరిగి బలంగా మారతాం." అని తెలిపాడు.
ఈ రోజుల్లో ప్రత్యేకించి ఓటీటీలో అనేక రకాల సినిమాలు చూసే అవకాశం ప్రజలకు కలుగుతోందని అంటాడు తారక్. "ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ల అభిరుచులు మారుతున్నాయి. నన్ను నేను విశ్లేషించుకొని, రాబోయే రోజులకు నన్ను రిబూట్ చేసుకొనే అవకాశం ఈ పీరియడ్ కలిగిస్తోంది." అని ఆయన చెప్పాడు.