యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` చిత్రీకరణ తుది దశలో ఉంది. ఇది కథానాయకుడిగా తారక్ కి 29వ సినిమా. ఆ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తన 30వ చిత్రం చేయనున్నారు ఎన్టీఆర్. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ఏప్రిల్ 29న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. కాగా, 31వ చిత్రాన్ని `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ తో చేయబోతున్నట్లు కొన్నాళ్ళుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని తారక్ కన్ఫామ్ చేశారు.
ఆ వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ బేస్డ్ వెబ్ పోర్టల్ `డెడ్ లైన్`కి ఇటీవల తారక్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో `ఆర్ ఆర్ ఆర్` విశేషాలతో పాటు కొరటాల కాంబినేషన్ మూవీ గురించి చెప్పారు. అలాగే తన 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తో చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో.. తారక్ నోట ప్రశాంత్ నీల్ సినిమా మాట రావడంతో అభిమానులు ట్విట్టర్ లో `#NTR 31` హ్యాష్ ట్యాగ్ తో ఈ రోజు ట్వీట్ల వర్షం కురిపించారు. ఫలితంగా ప్రస్తుతం `#NTR 31` ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
కాగా, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయనున్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. 2023 వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే అవకాశముందంటున్నారు.