మొదట ఆల్ ఇండియా రేడియోలో, తర్వాత తెలుగు చిత్రసీమలో సంగీత దర్శకుడిగా పనిచేసిన కె.ఎస్. చంద్రశేఖర్ కొవిడ్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చంద్రశేఖర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం. 1990లో ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేరిన ఆయన విశాఖపట్నం వాసులకు సుపరితుచితులయ్యారు. దాసరి నారాయణరావు చిత్రం 'బంట్రోతు భార్య'లో ఓ పాట పాడటం ద్వారా నేపథ్య గాయకునిగా సినీరంగ ప్రవేశం చేశారు చంద్రశేఖర్.
సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చీఫ్ అసోసియేట్‌గా, రమేశ్‌నాయుడు, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా పనిచేశారు. సంగీత దర్శకునిగా ఆయన తొలి చిత్రం చిరంజీవి హీరోగా నటించిన 'యమకింకరుడు' (1982). రాజభరత్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. ఆ తర్వాత బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, భోళాశంకరుడు, ఆత్మబంధువులు, కంచి కామాక్షి తదితర 30కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు చంద్రశేఖర్.
సినిమా అవకాశాలు తగ్గాక విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ ఇటీవలే రిటైర్ అయ్యాడు. ఒకసారి తిరుపతిలో చంద్రశేఖర్ ఇచ్చిన ప్రదర్శన చూసి ముచ్చటపడిన ఘంటసాల ఆయనకు తన హార్మోనియంను బహుమతిగా ఇచ్చారు. దాన్నిఎంతో అపురూపంగా చూసుకుంటూ ఇంటికి వచ్చిన అతిథులందరికీ ముందుగా దాన్ని చూపించేవారాయన.
ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, కోటి ఆయన వద్ద శిష్యరికం చేశారు. చంద్రశేఖర్ మృతి వార్తను సినీ రంగంలో కొనసాగుతున్న వారి మేనల్లుడు తెలియజేశారు.