పేరుకి కేరళకుట్టి అయినా తెలుగు, తమిళ భాషల్లోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్. మాతృభాష మలయాళంలో బాలనటిగా మూడు చిత్రాల్లోనూ, నాయికగా రెండు సినిమాల్లోనూ సందడి చేసింది కీర్తి. హీరోయిన్ గా చేసిన రెండు చిత్రాల్లో ఒకటి (గీతాంజలి) నిరాశపరచగా.. మరొకటి (రింగ్ మాస్టర్) జస్ట్ ఓకే అనిపించుకుంది.
ఈ నేపథ్యంలో.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం కీర్తి మరో మలయాళ సినిమాతో పలకరించబోతోంది. ఆ చిత్రమే.. `మరక్కార్ : అరబిక్ కడలింటే సింహం`. మలయాళంలో కీర్తి నాయికగా నటించిన తొలి చిత్రం `గీతాంజలి`ని రూపొందించిన ప్రియదర్శన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. `గీతాంజలి`లో మరో ప్రధాన పాత్ర పోషించిన మోహన్ లాల్ ఇందులో టైటిల్ రోల్ లో నటించారు. కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 12న పలు భాషల్లో పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గా `బెస్ట్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్`, `బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్` విభాగాల్లో `మరక్కార్`కి `జాతీయ పురస్కారాలు` దక్కిన నేపథ్యంలో.. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
మరి.. ఈ చిత్రంతోనైనా కీర్తి సురేశ్ కి మాతృభాషలో సాలిడ్ హిట్ దక్కుతుందేమో చూడాలి.