కరోనా సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా జనం ఆగమాగమవుతున్నారు. కొవిడ్‌తో బాధపడుతున్న వారికి అవసరమైనప్పుడు బెడ్లు లభించడం లేదు. ఆక్సిజన్ అందడం లేదు. దీంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కాకుండా ఉంటున్నాయి. తరచూ ఆక్సిజన్ లభించక, ప్లాస్మా చికిత్స అందక రోగులు మృత్యువాత పడుతున్న వార్తలు చూస్తున్నాం. ఈ తరహా ఇబ్బందులు పడుతున్నవారికి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు నటి రేణు దేశాయ్.
ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఫాలోయర్స్‌తో మాట్లాడిన ఆమె, "ప్లాస్మా లేదా ఆక్సిజన్ సిలిండర్లు, లేదా మెడిసిన్ అవసరమైతే దయచేసి నాకు మెసేజ్ చేయండి. నాకు సాధ్యమైనంత మేర సాయం చేయడానికి ప్రయత్నిస్తాను." అని చెప్పారు. "సినిమావాళ్లు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాను వాడుతుంటారు. కానీ గత 15 రోజులుగా చూస్తున్నాను.. కొవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని వారు షేర్ చేస్తున్నారు. ప్లాస్మా డోనార్స్ గురించి, ఆక్సిజన్ గురించి, బెడ్స్ గురించి అప్డేట్స్ ఇస్తున్నారు." అని ఆమె అన్నారు.
"నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఇన్ బాక్స్ ఇప్పటి నుంచి ఓపెన్‌లో పెడతా. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్ ద్వారా కాంటాక్ట్ చేయండి. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయం మాత్రం చేయలేను." అని ఆమె తెలిపారు.