`ఖైదీ`తో తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం అందుకున్నారు కోలీవుడ్ స్టార్ కార్తి. ఆ తరువాత తన నుంచి `తంబి` (తెలుగులో `దొంగ`), `సుల్తాన్` చిత్రాలు రాగా.. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అందులేకపోయాయి. కాగా, ప్రస్తుతం కార్తి చేతిలో రెండు తమిళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ చిత్రాలే.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న హిస్టారికల్ ఫిక్షన్ `పొన్నియన్ సెల్వన్`, `అభిమన్యుడు` ఫేమ్ పి.ఎస్. మిత్రన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `సర్దార్`. ఈ రెండు సినిమాల్లోనూ విభిన్న పాత్రలను పోషిస్తున్నారు కార్తి.
ఇదిలా ఉంటే.. `సర్దార్` చిత్రంలో కార్తి ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. అంతేకాదు.. ఓ రోల్ కోసం ఓల్డ్ లుక్ లోనూ కనిపించనున్నారు. కథానుసారం.. ఈ పాత్ర ఓ జైలులో ఖైదీగా ఉంటుంది. కాగా, సహజత్వం కోసం ఆ జైలుని భారీ బడ్జెట్ తో సెట్ వేసి నిర్మించారట. అంతేకాదు.. ఈ సెట్ కోసం ఏకంగా రూ. 2 కోట్ల మొత్తం వెచ్చించారని బజ్. అలాగే, `సర్దార్` హైలైట్స్ లో ఈ సెట్ కూడా ఒకటని కోలీవుడ్ ఇన్ఫర్మేషన్.
`సర్దార్`లో రాశీ ఖన్నా, రజీషా విజయన్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.