దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీది పాతికేళ్ళ ప్రస్థానం. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ స్టార్ డైరెక్టర్.. ఇప్పటివరకు కేవలం తొమ్మిది సినిమాలే చేశారు. విడుదలకు సిద్ధమైన `గంగూబాయి కతియావాడి` (అలియా భట్ ప్రధాన పాత్రధారిణి) ఆయన పదో చిత్రం. కాగా, తన నెక్స్ట్ వెంచర్ ని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ప్లాన్ చేస్తున్నారట భన్సాలీ. దర్శకుడిగా భన్సాలీ స్థాయిని పెంచిన `దేవదాస్` (2002)లో షారుఖ్ నే కథానాయకుడు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానేలేదు.
కట్ చేస్తే.. త్వరలో వీరిద్దరు మరోమారు జట్టుకట్టనున్నారట. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `ఇజ్ హార్` అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారని టాక్. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, షారుఖ్ ఖాన్ ప్రస్తుతం `పఠాన్` చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆపై స్టార్ కెప్టెన్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలోనూ షారుఖ్ ఓ మూవీ చేయనున్నారు. భన్సాలీ డైరెక్టోరియల్ తో సమాంతరంగా ఈ ప్రాజెక్ట్ చేసే ప్రణాళిక చేస్తున్నారట షారుఖ్.
మరి.. `జీరో`తో పూర్తి స్థాయిలో ట్రాక్ తప్పిన షారుఖ్ .. రాబోయే చిత్రాలతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.