1977 సెప్టెంబర్‌లో రాజేంద్రప్రసాద్ అనే యువకుడిని తమ 'స్నేహం' చిత్రంతో వెండితెరకు పరిచయం చేశారు బాపు-రమణ. ఆ సినిమా వచ్చిన 14 సంవత్సరాల తర్వాత రాజేంద్రప్రసాద్ హీరోగా 'పెళ్లి పుస్తకం' సినిమా తీశారు బాపు. అది విడుదలైన తర్వాత నుంచీ ప్రపంచంలో ఎక్కడ తెలుగువాళ్ల పెళ్లి జరిగినా ఆ సినిమాలోని "శ్రీరస్తు శుభమస్తు" పాట వినిపించకుండా లేదు. ఆ సినిమా తెలుగు సమాజంపై చూపించిన ప్రభావం సామన్యమైంది కాదు. ఎవరైనా భార్యభర్తలు గొడవలు పడి, తన వద్దకు కౌన్సిలింగ్‌కు వస్తే వాళ్లకు ఓసారి పెళ్లి పుస్తకం సినిమా చూడమని చెప్పేవాడ్నని ప్రఖ్యాత సైకాలజిస్ట్ బి.వి. పట్టాభిరామ్ చెప్పారు. అదీ ఆ సినిమా గొప్పతనం!
'పెళ్లి పుస్తకం' తర్వాత 'మిష్టర్ పెళ్లాం' సినిమాలోనూ భార్యాభర్తల అనుబంధాన్ని మరోసారి అందంగా చూపించారు బాపు. రామాయణం అంటే ఆయనకు పిచ్చి. సీతారాములన్నా, ఆంజనేయుడన్నా ఆయనకు విపరీతమైన భక్తి, ప్రేమ. ఆయన రూపొందించిన 'రాంబంటు' సినిమాలో రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్ర ఆంజనేయుడి పాత్రే. ఆ సినిమా నిర్మాత రాజేంద్రప్రసాదే. టైటిల్స్‌లో నిర్మాతగా ఆయన భార్య పేరు కనిపిస్తుంది.
"బాపూ రమణలు 'రాంబంటు'ను నా సినిమాగా కాక వాళ్ల సొంత సినిమాలా ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో తీశారు. అలాంటి గొప్ప సంస్కారవంతులను మనం మళ్లీ చూడలేం. ఆ సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదనే బాధ లేదు. టీవీలో ఎప్పుడు వేసినా దాన్ని జనం బాగా చూస్తూనే ఉన్నారు. వాళ్లతో ఆ సినిమా సొంతంగా తీసే భాగ్యం కలిగింది. అంతే చాలు." అని తెలిపారు రాజేంద్రప్రసాద్.