``నాకు కొంచెం తిక్క ఉంది.. కానీ దానికో లెక్క ఉంది``, ``నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ``, ``నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా``.. ఇలాంటి డైలాగ్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి నేటికి సరిగ్గా తొమ్మిదేళ్ళయింది. అలా.. పవన్ క్రియేట్ చేసిన ఆ సంచలనమే `గబ్బర్ సింగ్`. హిందీ చిత్రం `దబాంగ్` (సల్మాన్ ఖాన్)ని ఆధారంగా చేసుకుని తెలుగు నేటివిటికి తగ్గట్టు దర్శకుడు హరీశ్ శంకర్ చేసిన మార్పులు, చేర్పులు ఈ సినిమా ఘనవిజయంలో కీలక భూమిక పోషించాయి. ఇక ఈ చిత్రంతోనే చెన్నైపొన్ను శ్రుతి హాసన్ తన కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ చూసింది.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``గబ్బర్ సింగ్`` టైటిల్ సాంగ్, ``ఆకాశం అమ్మాయైతే``, ``పిల్లా నువ్వు లేని జీవితం``, ``గుండె జారి గల్లంతయ్యిందే``, ``కెవ్వు కేక``, ``మందు బాబులం``.. ఇలా ఇందులోని ప్రతీ గీతం ఓ సంచలనమే. `బెస్ట్ యాక్టర్`, `బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్`, `బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్` (వడ్డేపల్లి శ్రీనివాస్) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకున్న `గబ్బర్ సింగ్`ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మించారు. 2012 మే 11న విడుదలై అఖండ విజయం సాధించిన `గబ్బర్ సింగ్`.. నేటితో 9 వసంతాలను పూర్తిచేసుకుంది.