నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు?.. నందమూరి అభిమానుల్లో ఎడతెగని మిలియన్ డాలర్ ప్రశ్న ఇది. 2016 లేదా 2017లోనే మోక్షజ్ఞ తెరంగేట్రం ఖాయమని ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. అంతెందుకు? స్వయంగా బాలయ్యే తన కుమారుడి ఎంట్రీ గురించి ఐదేళ్ల క్రితమే మాట్లాడారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయే కానీ, మోక్షజ్ఞ మాత్రం కెమెరా ముందుకు రావట్లేదు. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తికీ, అసహనానికీ గురవుతున్నారు.
2016 ఆరంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు చూసి మోక్షజ్ఞ జడ్జిమెంట్ ఇస్తుంటాడని చెప్పారు. 'డిక్టేటర్' మూవీ చూసి పదికి ఎనిమిది మార్కులు ఇచ్చాడని ఆయన చెప్పారు. "తను నా సినిమాలను చూసి జడ్జిమెంట్ చెప్పడం 'లెజెండ్'తో మొదలైంది. మోక్షజ్ఞ డాన్సుల్లోనూ, ఫైటుల్లోనూ, నటనలోనూ శిక్షణ తీసుకున్నాడు. తనని ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది కానీ పరిచయం చేయాలనుకుంటున్నాం." అని బాలయ్య వెల్లడించారు.
అలాగని మోక్షజ్ఞ ఎంట్రీపై ఆయన పెద్ద ప్లాన్లేమీ వేయలేదు. "తొలి సినిమాతోనే తనేం భూమిని చుట్టేయక్కర్లేదు. మంచి కథతో ఎంట్రీ ఇస్తే చాలు. తనకు కావాల్సింది ఒక్క హిట్టు కాదు, పలు సూపర్‌హిట్ సినిమాలు. తనని చూసి ప్రేక్షకులు 'మావాడు, మా పక్కింటివాడు, మా ఎదురు పోర్షన్లో అద్దెకున్న కుర్రాడు' అని అనుకోవాలి. అంతగా దగ్గర చేసుకోవాలి. అలాంటి కథలతో తను ప్రేక్షకుల్లోకి వెళ్లాలి. నన్ను కూడా అభిమానులు అలాగే అనుకుంటారు." అని కొడుకును ఎలాంటి సినిమాల్లో చూడాలనుకుంటున్నారో బాలయ్య చెప్పారు.
కానీ మోక్షజ్ఞ ఇంతదాకా తండ్రి కోరిక తీర్చే మార్గంలో ముందడుగు వేయలేదు. ఎప్పుడు ఆ అడుగు వేస్తాడా అని ఫ్యాన్స్ మాత్రం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 26 సంవత్సరాలు.