సీనియర్ నటుడు, రచయిత మడంపు కుంజుకుట్టన్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. త్రిసూర్‌లోని అశ్విని హాస్పిటల్‌లో ఆయన కొవిడ్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. జయరాజ్ డైరెక్ట్ చేసిన మలయాళం ఫిల్మ్ 'కరుణమ్' (2000)కు గాను బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా కుంజుకుట్టన్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల టెస్ట్‌లో కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ, అక్కడే తుదిశ్వాస విడిచారు. మొదట శ్వాసక్రియ సమస్యలు తలెత్తడంతో హాస్పిటల్‌లో చేరి, చికిత్స పొందిన అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అయితే రెండు రోజుల తర్వాత తీవ్ర జ్వరం రావడంతో తిరిగిన హాస్పిటల్‌లో చేరారు.
సినిమాల్లోకి రాకముందు కుంజుకుట్టన్ కొడుంగళ్లూర్ అనే గ్రామంలో సంస్కృత టీచర్‌గా పనిచేశారు. అలాగే సమీపంలోని గుడిలో పూజారిగానూ ఆయన పనిచేశారు. కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్, 'పరిణామమ్' సినిమాకు అశ్‌దోద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డు, 2014లో ప్రతిష్ఠాత్మక సంజయన్ అవార్డ్ అందుకున్నారు. కుంజుకుట్టన్ కొన్ని నవలలు, కథలు రాశారు. అవన్నీ కేరళ సమాజాన్ని ప్రతిబింబించేవే. ఆయన మృతికి పలువురు మలయాళీ సెలబ్రిటీలు శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.